ఏపీలో ఎస్సీఎస్టీ నియోజకవర్గాలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే.. ఏం తేల్చిందంటే..

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది విభిన్న రూపాల్లో వ్యక్తమవుతోంది. దాంతో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు వచ్చే ఎన్నికలే అత్యంత కీలకం. అయితే ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వీనియోగం చేసుకొంటూ..  జగన్ పార్టీలోని లోపాలను.. ప్రతిపక్ష టీడీపీ... బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లగలిగితే.. సైకిల్ సవారీ చేసినంత ఈజీగా..  తెలుగుదేశం పార్టీ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోగలుగుతుంది. 
అయితే ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ ఇన్‌చార్జులను నియమించడం.. అలాగే ఇన్‌చార్జులు లేని నియోజకవర్గంలో వారిని నియమించడం.. వారి ద్వారా నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని ఒకే తాటిపైకి తీసుకు వస్తేనే విజయం తెలుగుదేశం సొంతం అవుతుంది. ఈ విషయాన్ని శ్రీ ఆత్మసాక్షి సంస్థ (ఎస్ఎఎస్) నిర్వహించిన సర్వే  తేటతెల్లం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 29 ఎస్సీ , 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి.   ఆయా నియోజకవర్గాల్లో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష టీడీపీ పరిస్థితిపై శ్రీ ఆత్మసాక్షి ( ఎస్ ఏ ఎస్ ) గ్రూప్ సర్వే ప్రకారం   ఎస్సీ నియోజకవర్గాల విషయానికి వస్తే...    ఈ నెల 24 వరకూ నిర్వహించిన సర్వేలో పార్టీల పరిస్థితి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పై చేయి సాధిస్తుంది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉంటే ఏ మౌతుంది. పొత్తే లేకుండా ఆ రెండు పార్టీలూ వేర్వేరుగా రంగంలోకి దిగితే ప్రయోజనం సిద్ధించేది ఏ పార్టీకి తదితర అంశాలపై   ఆసక్తి కర ఫలితాలు వెలువడ్డాయి.  కొన్ని ఎస్సీ నియోజకవర్గాలలో అధికార వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆ  పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ, ఆయా నియోజకవర్గాలలో  తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్పప్పటికీ ఆ అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయిలో తెలుగుదేశం పని తీరు లేదు. ఇలాంటి 15 నియోజకవర్గాలపై తెలుగుదేశం  మరింత నిశిత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం పార్వతీపురం, పి.గన్నవరం, అమలాపురం, గోపాలపురం, చింతలపూడి, పామర్రు, తిరువూరు, సత్యవేడు, అలాగే పూతలపట్టు, రైల్వే కోడూరు, ప్రత్తిపాడు, మడకశిర, నంది కొట్కూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో అధికార వైసీపీ ప్రజా విశ్వాసాన్ని  కోల్పోయింది.  ఆయా నియోజకవర్గాలలో తెలుగు దేశం పని తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2024 ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలంటే ఈ నియోజకవర్గాలపై తెలుగుదేశం మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నియోజకవర్గాలలో తెలుగుదేశం కంటే వైసీపీ అనుకూల వోటే ఎక్కువగా ఉంది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే ఎస్సీఎస్టీ మైనారిటీలలో యువ వోటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక  కొన్ని అసెంబ్లీ స్థానాలలో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం విఫలమైంది. అలాగే బలహీనమైన నియోజకవర్గ  ఇన్ చార్జల కారణంగా ఈ సీట్లలో తెలుగుదేశం వెనుకబడింది. ప్రస్తుత ఇన్ చార్జీల పని తీరు పట్ల పార్టీ క్యాడర్ లోనూ ప్రజలలోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది. 
శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల వారీగా ఫలితాలిలా ఉన్నాయి...

  శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైసీపీ కంటే తెలుగుదేశందే పై చేయిగా ఉంది. ఇక్కడ అధికార వైసీపీ కంటే తెలుగుదేశం వైపు 3.7శాతం మొగ్గు కనిపిస్తోంది. అయితే కొంత మంది తెలుగుదేశం నాయకుల పని తీరు సంతృప్తి కరంగా లేదు.  తెలుగుదేశం ఇన్ చార్జ్ కి సహకారం అందించడం లేదు. మొత్తంగా రాజాం నియోజకవర్గ  తెలుగుదేశంలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. 

అలాగే విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. తెలుగుదేశం కంటే ఇక్కడ వైసీపీకి 30 శాతం తక్కువగా  అనుకూలత కనిపిస్తోంది. మొత్తం మీదఈ నియోజకవర్గంలో  హోరాహోరీ పోరు ఉంటుంది. పాయకరావు పేట నియోజకవర్గంలో జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు ఉందన్న అంచనాల ప్రకారం ఈ నియేజకవర్గంలో జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేస్తే  తెలుగుదేశం ఒటమి పాలయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అదే వైసీపీ 2024 ఎన్నికలలో ఈ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెడితే కనుక సమీకరణాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 

ఇక విజయనగరం జిల్లా పార్వతీపురం అసెంబ్లీ స్థానం విషయానికి వస్తే.. ఇక్కడ తెలుగుదేశం, వైసీపీల మధ్య గట్టి పోటీ ఉంది. ఇరు పార్టీల మధ్య కేవలం 1.5శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇక్కడ వైసీపీకి 1.5 శాతం మొగ్గు కనిపిస్తోంది.

అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జల్లా రాజోలు నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ జనసేన పార్టీకి 4 శాతం మెగ్గు కనిపిస్తోంది. ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికే పరిమితమౌతుంది. 

 ఇదే జిల్లా పీ. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పనితీరు 30 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ కంటే తెలుగుదేశం, జనసేనల పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే ఓట్ల చీలిక కారణంగా వైసీపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

అలాగే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి ఇన్ చార్జి లేడు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల వ్యతిరేకత ఉంది. ఇక్కడి ఎమ్మెల్యేకు 27 శాతం కంటే తక్కువ మద్దతు ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేవం, జనసేన పార్టీలకు ప్రజామద్దతు ఉంది. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికే పరిమితం కాక తప్పదు. అయితే ఇక్కడ గెలుపు అన్నది తెలుగుదేశం, జనసేన పొత్తుపై ఆధారపడి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో జనసేనకు 16 శాతం ఓటు షేరు ఉంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గలో ప్రస్తుతానికి తెలుగుదేశం కంటే 4.5 శాతం మొగ్గు ఎక్కువ ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పని తీరు ఏ మాత్రం మెరుగ్గా లేదు. తెలుగుదేశం ఈ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది. ఈ నియోజకవర్గంలో  మెరుగైన ఫలితం సాధించాలంటే.. ప్రజల విశ్వాసాన్ని పొందిన వ్యక్తిని ఇన్ చార్జిగా నియమించాల్సి ఉంది.

ఇదే జిల్లాలోని గోపాల పురం నియోజకవర్గంలో తెలుగుదేశం పట్ల ప్రజా విశ్వాసం బొత్తిగా తక్కువగా ఉంది. ఇక్కడి తెలుగుదేశం ఇన్ చార్జిపై ప్రజా వ్యతిరేకత గరిష్టంగా ఉందని సర్వే తేల్చింది. వైసీపీపై కూడా ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశాలు లేవని సర్వే ఫలితం పేర్కొంంది. ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ సమర్ధుడైన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది. 

ఇక నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు 20శాతం కంటే దిగువన ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పనీ తీరు ఏ మంత ఆశాజనకంగా లేదు.  ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కనుక వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబెడితే 2024 ఎన్నికలో ఆ పార్టీ విజయం సాధిస్తుంది. తెలుగుదేశం ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే మాత్రం ప్రస్తుత ఇన్ చార్జిని మార్చి 2024 ఎన్నికలలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి.

ఇదే జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గంలో కూడా వైసీపీకే స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి 3.5శాతం ఓటు షేరు ఆధిక్యత ఉంది. ఇక్కడ తెలుగుదేశం ఇన్ చార్జి పని తీరు కారణంగా ఆ పార్టీ ప్రజా విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది. ఇక్కడ  తెలుగుదేశం పుంజుకోవాలంటే బాగా కష్టపడటంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. లేదా కొత్త ఇన్ చార్జ్ ని నియమించాలి.

ప్రకాశం జిల్లా కొండెపి విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకే మొగ్గు కనిపిస్తోంది. వైపీసీ కంటే 4.5 శాతం అధిక ఓటు షేరుతో  తెలుగుదేశం ముందుంది. వైసీపీ పని తీరు పట్ల ప్రజలలో వ్యతిరేకత అధికంగా ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబడితే సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి.

ఇదే జిల్లా సంతనూతల పాడు అసెంబ్లీ నియోజకవర్గంలోసిట్టింగ్  ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పని తీరు కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి తెలుగుదేశం మరింత దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం పని తీరు సంతృప్తికరంగా లేదు. వైసీపీ కనుక ఇక్కడ కొత్త అభ్యర్థిని ప్రవేశపెడితే సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సంతనూతల పాడు నియోజకవర్గంలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ  1 నుంచి 1.5 శాతం ఓటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోంది. 

ఇక ఎర్రగొండ పాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రస్తుతం వైసీపీ మెరుగైన స్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ కంటే నాలుగు శాతం ఓటు షేరు ఆధిక్యతతో ఉంది. ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం ఇన్ చార్జి మరింత దృష్టి పెట్టి  అలాగే అన్ని సమాజిక వర్గాలకూ పార్టీని చేరువ చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే  ఎర్రగొండ పాలెం వైసీపీ ఖాతాలో పడుతుంది.

అనంతపురం జిల్లా  సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ తెలుగుదేవం పార్టీ 2.5శాతం అధిక వోటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోంది. అయితే తెలుగుదేశం ఇన్ చార్జికి కొంత మంది పార్టీ నాయకులు సహకరించడం లేదు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ పార్టీ హై కమాండ్ ప్రత్యేక దృష్టి సారించి గ్రూపు రాజకీయాలను కంట్రోల్ చేయాల్సన అవసరం ఉంది. 

మడకశిర నియోజకవర్గంలో ప్రస్తుతానికి తెలుగుదేశం కంటే మొగ్గు వైసీపీ వైపే ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ చార్జి పని తీరు అసంతృప్తికరంగా ఉంది.  ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాల్సి ఉంది.

చిత్తూరు జిల్లా సత్యవేడు  నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం కంటే వైసీనీ 4శాతం ఓటు షేరుతో ముందంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో సరైన ఇన్ చార్జిని నియమించడంలో తెలుగుదేశం విఫలమైంది. ప్రస్తుత ఇన్ చార్జితో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం 2024 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు లేవు. ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒకింత భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు వచ్చే ఎన్నికలో పోటీ చేసేందుకు సరైన ఎస్సీ అభ్యర్ది అవసరం ఉంది.

ఇదే జిల్లా పూతల పట్టు నియోజకవర్గంలో కూడా 4.5 శాతం ఓట్ల షేరుతో తెలుగుదేశం కంటే వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన ఇన్ చార్జిని నియమించడమే కాకుండా, పార్టీ క్యాడర్ లో ఉత్సామాన్ని నింపక పోతే పూతల పట్టు వైపీసీ ఖాతాలో పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

ఇక గంగాదర నెల్లూరు విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ కంటే  తెలుగుదేశం  వైపు మొగ్గు కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.  అయితే ఇక్కడ ప్రజలలో విశ్వాసం కల్పించడంలో తెలుగుదేశం ఇన్ చార్జ్ విఫలమయ్యారు. ఇక్కడ 2024లో మెరుగైన ఫలితం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలి. దే సమయంలో అవసరం అనుకుంటే ఇక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి. 

గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ కంటే 3.25శాతం ఓటు షేరుతో ముందుంది. అయితే ఈ నియోజకవర్గంలో కొందరు తెలుగుదేశం నాయకులు ప్రస్తుత ఇన్ చార్జికి సహకరించడం లేదు. ఈ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలపై తెలుగుదేశం అధిష్టానం దృష్టి సారించాల్సి ఉంది. 

ఇదే జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ప్రస్తుతం వైసీపీ కంటే 2.75శాతం ఓటు షేరుతో తెలుగుదేశం ఆధిక్యత కనబరుస్తోంది. 

ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో అసంతృప్తి వ్యక్తమౌతోంది. అదే సమయంలో తెలుగుదేశం ఇన్ చార్జి ఇక్కడ ప్రజా విశ్వాసం పొందడంలో విఫలమయ్యారు. ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే టీడీపీ ఇన్ చార్జిని మార్చాల్సి ఉంటుంది. లేకుంటే ఈ నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది.

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఇక్కడ తెలుగుదేశంలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గ ఇన్ చార్జి పని తీరు కూడా సంతృప్తికరంగా లేదు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే 4.75 శాతం ఓటు షేరు ఆధిక్యతతో వైసీపీ ముందుంది. 

కొడుమూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ 1.25 శాతం ఓటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోందిజ

ఇక కృష్ణా జిల్లా పామర్రు నియోజవకర్గంలో అయితే తెలుగుదేశం కంటే వైసీపీ మెరుగైన పరిస్థితిలో ఉంది.  ఇక్కడ  అధికార పార్టీ పట్ల 6.25శాతం అధిక ఓటు షేరుతో మొగ్గు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పుంజుకోవాలంటే తెలుగుదేశం మరింత దృష్టి పెట్టి ప్రజలకు చేరువ కావడానికి కష్టపడాలి.

అలాగే నందిగామ నియోజకవర్గంలో కూడా వైసీసీ 1.75శాతం ఓటు షేరుతో తెలుగుదేశం కంటే మెరుగైన స్థితిలో ఉంది. అధికార పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ దానికి అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజలలో విశ్వాసం కల్పించడమే కాకుండా పార్టీ బలో పేతానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. 

తిరువూరులో ప్రస్తుతానికి   తెలుగుదేశం, వైసీపీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఓటు షేరు శాతం కేవలం1.25 శాతం మాత్రమే.  ఇక్కడ ఇరు పార్టీలూ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

కడప జిల్లా బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ  వైసీపీ ఇన్ చార్జి, క్యాడర్ పని తీరు తెలుగుదేశంతో పొలిస్తే 9 శాతం మెరుగ్గా ఉంది. తెలుగుదేశం  ఇన్ చార్జి పని తీరు ఏ మాత్రం సంతృప్తి కరంగా లేదు. ప్రజా విశ్వాసం చూరగొనడంలో పార్టీ ఇన్ చార్జ్ క్యాడర్ విఫలమయ్యారు. 

రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీయే అధిక్యత కనబరుస్తోంది. తెలుగుదేశం పార్టీ కంటే 2.5శాతం ఓటు షేరుతో ముందుంది. ఈ నియోజకవర్గ తెలుగుదేవం ఇన్ చార్జ్ ప్రజా విశ్వాసం చూరగొనడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 


తొలుత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష టీడీపీ కంటే 5 శాతం ఓట్ల షేర్‌తో ముందంజలో ఉంది. స్థానికంగా టీడీపీ పని తీరు ఆశించిన స్థాయిలో లేదు.... అలాగే స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జ్ సైతం.... పార్టీ కేడర్‌తోపాటు ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గంపై టీడీపీ మరింత దృష్టి సారించాల్సి ఉంది. 

ఇక ఉమ్మడి విజయనగరంలోని కురుపాం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుపై దాదాపు 30 శాతం మంది ప్రజలు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గ ప్రజల్లో.. ఈ ప్రభుత్వంపై బాగానే అసంతృప్తి గూడు కొట్టుకొని ఉంది. ఇక స్థానిక తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతోంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గానికి సరైన టీడీపీ ఇన్‌చార్జ్‌ కూడా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

అలాగే సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ కంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3.5 శాతం ఓట్ల షేరుతో అధిక్యంలో ఉంది. అయితే ప్రస్తుత పార్టీ ఇన్‌చార్జ్‌ మరింత కష్టపడడంతోపాటు.. పార్టీ కేడర్‌లోనే కాకుండా ప్రజల్లో సైతం విశ్వాసాన్ని కల్పిస్తే.. విజయం నల్లేరు మీద నడకలా సాగిపోనుందనేది సుస్పష్టం. 
ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు నియోజకవర్గంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య 2 శాతం ఓట్ల షేరింగ్ ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య హోరా హోరి పోరాటం జరగుతోంది.  అయితే ప్రస్తుతం.. టీడీపీ కంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో ఉంది. ఇక స్థానిక ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జీ.. సరైన పనితీరు కనబరచడం లేదు. అంతేకాదు.. పార్టీ కేడర్‌లో సైతం సరైన రీతిలో ఆత్మవిశ్వాసం నింపలేకుండా సదరు ఇన్ చార్జ్ ఉన్నారు. మరోవైపు గ్రామ, మండల స్థాయిలోని కేడర్ సైతం..ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు సరైన రీతిలో సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గంపై టీడీపీ మరింత ప్రత్యేక శ్రద్ద కనబరచాల్సి ఉంది. 

అలాగే ఇదే జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో అటు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి దొందు దొందుగానే ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు పార్టీల నాయకులు పనితీరు ఏ మాత్రం బాగోలేదనే చెప్పాలి. అధికార వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు 35 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే గ్రూప్ రాజకీయాలతో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఇక టీడీపీ ఇన్‌చార్జ్ పనితీరు సైతం ఆశించిన స్థాయిలో అయితే లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పలితం మాత్రం.. ఇరు పార్టీలు నిలబెట్టే అభ్యర్థులపై ఆధారపడి ఉంటాయన్నది సుస్పష్టంగా గోచరిస్తోంది.

ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పనితీరు.. 25 శాతం కంటే తక్కువగానే ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని సాక్షాత్తూ ఎమ్మెల్యేకు సైతం అర్థమైపోయింది. మరోవైపు టీడీపీ పనితీరు సైతం ఏ మాత్రం బాగోలేదు. అంతేకాదు.. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంలో సైతం.. సైకిల్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే మాత్రం ప్రస్తుత ఇన్‌చార్జీని ముందుగా మార్చాలని.. అలాకాకుంటే.. సైకిల్ పార్టీ గెలుపు చాలా కష్టమని స్పష్టమవుతోంది. 

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏకైక ఎస్టీ నియోజకవర్గం...పోలవరం. ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే.. వైయస్ఆర్ సీపీ 5 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. అయితే ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జీ అయితేనేమీ.. పార్టీ కేడర్ అయితేనేమీ ప్రజల్లోకి బలంగా వేళ్లింది అయితే లేదు. అంతేకాదు.. ఓటర్లు, ప్రజల విశ్వాసం చూరగొనడంలో.. ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే మాత్రం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాల్సిందే. 

అయితే వచ్చే ఎన్నికల్లో రంపచోడవరం, పాడేరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలంటే మాత్రం.. ఆయా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థిని అనేకంటే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలి. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జులు..  ఓవైపు తమ పనితీరును మెరుగుపరుచుకొంటూ.. మరోవైపు పార్టీలోని వారందరిని ఒకే తాటిపైకి తీసుకురావడం కోసం కృషి చేయాలి. తద్వారా సైకిల్ పార్టీ గెలుపు సునాయాసం అవుతోందని శ్రీ ఆత్మ సాక్షి నిర్వహించిన సర్వే ద్వారా తేటతెల్లమవుతోంది.