భేటీకి సిద్ధం..!
posted on Dec 26, 2022 @ 10:49PM
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మళ్లీ తెలుగుదేశం పార్టీ గుటికి తిరిగి వెళ్లిపోతారా? ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. తెలంగాణలో సైకిల్‌ని సవారీ చేయిస్తారా? అందుకోసం ఆయిన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో ఆయిన తనదైన శైలిలో పావులు కదుపుతోన్నారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలే అందుకు సాక్ష్యమని వారు వివరిస్తున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఒకటి ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట సభ నిర్వహించడం... ఆ సభ కాస్తా సూపర్ సక్సెస్ కావడం.. ఈ సభకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడం.. అలాగే ఈ సభా వేదికపై నుంచి పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా సరే.. తిరిగి రావొచ్చునంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీని వదిలి వెళ్లిన వారి గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో పేర్కొంటున్నారు.
ఇక రెండోవది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు.. సూపర్ సీనియర్లంతా.. తమకు కాకుండా... నిన్న కాక మొన్న పార్టీలోకి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టారంటూ.. హస్తం పార్టీలోని కురు వృద్దులంతా తనదైన శైలిలో అసమ్మతి గళం విప్పడం.. ఆ క్రమంలో ధర్నాలు, నిరసనలు, దాడులు.. ప్రతి దాడులకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం.. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల మాజీ బాధ్యుడు, హస్తం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. ఎదుటే పంచాయతీ పెట్టడం.. దీంతో వారందరినీ ఈ డిగ్గీరాజా కూల్‌గా.. సైలెంట్ చేశారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులంతా.. తమ పదవులకు రాజీనామా చేసి.. హస్తం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారని.. అదీకాక పీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీ వీడి.. బీజేపీలోకి జంప్ కొట్టగా.. త్వరలో ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం కాషాయం కండువా కప్పుకోనేందుకు సమయత్తమయ్యారని.. వారు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.
మరోవైపు తొలుత రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారని.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయిన వరుస విజయాలను సైతం అందుకున్నారని.. కానీ రాష్ట్ర విభజన జరగడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తం పార్టీ గుటికి చేరాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా సోదాహరణగా విపులీకరిస్తున్నారు.
అలా హస్తం పార్టీలోకి వెళ్లిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌గా ఢిల్లీ అధిష్టానం పగ్గాలు అప్పగించిందని.. అయితే తెలంగాణ తెచ్చింది కారు పార్టీ అధినేత కేసీఆరే అయినా.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ అంటూ ప్రజల్లోకి వెళ్లి బలంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్న హస్తం పార్టీ నేతలకు.. రేవంత్ రెడ్డి ఓ బలమైన గొంతుకగా మారారని.. ఆ క్రమంలో ఆయిన హస్తం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ పేరుతో సభలు, పాదయాత్రలు చేస్తూ.. తెలంగాణలో ఆ పార్టీని కాంగ్రెసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారని ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తన బహిరంగ సభలకు లక్షలాది మంది ప్రజలను రేవంత్ రెడ్డి స్వచ్చందంగా రప్పించుకోగలుగుతోన్నారు కానీ.... పార్టీలోని నేతలను మాత్రం ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీలోనే ఉండి.. ఆ పార్టీ నేతలతో చెయ్యి.. చెయ్యి కలిపి.. కలిసి నడవడం కంటే.. సైకిల్ పార్టీలోకి వెళ్లిపోయి.. తన పాత మిత్రులతోపాటు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి జీవులను సైతం మళ్లీ పసుపు పార్టీలోకి తీసుకు వచ్చి.. వారందరిని ఏకం చేసి.. అడుగులో అడుగు వేసుకొంటూ కలిసి నడిస్తే.. సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చుననే ఓ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అదీకాక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కి ఆయన ప్యామిలీకి ఇప్పటికే బీజేపీతో వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉందని... అలాగే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారడంతో.. ఆ పార్టీలోని తెలంగాణను వదిలేసి.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిపోయారంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్‌చల్ చేస్తోందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఇలాంటి సమయంలో బీజేపీకి ఏమో కానీ.. సైకిల్ పార్టీకి మాత్రం మంచి బలం పుంజుకోనే సమయమని వారు విశ్లేషిస్తున్నారు. ఓ వేళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని వీడి..తన పాత పార్టీలోకి వెళ్లితే.. సైకిల్ పార్టీ దెబ్బకు కారు పార్టీ.. తెలంగాణలో షికారు చేయడం కష్టమని.. అలాగే కాషాయ పార్టీ నేతలకు సైతం అసలు సిసలు బొమ్మ.. ఈస్ట్‌మన్ కలర్‌లో పోలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో ఓ అంచనా వేసి మరీ చెబుతున్నారు.