గోమూత్రంతో ప్రక్షాళన!
posted on Sep 13, 2022 @ 2:08PM
అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడని తెలిసి పెద్దావిడ వెళ్లింది. గృహప్రవేశం రోజు ఇల్లంతా పసుపునీల్లు జల్లి, ద్వారాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి తోరణాలు కట్టి నానా హడావుడీ చేసిందామె. ఎవరో ఛాదస్తం అన్నారు. కాదు సంప్రదాయమన్నదామె. పక్కవీధిలో మొన్నటికి మొన్న ఆవే ఈనితే లక్ష్మీదేవి అంటూ పూజలు చేసి గోశాలంతా పసుపునీల్లు చిలకరించి దణ్ణాలు పెట్టి ఇల్లంతా పండగ చేసుకున్నారు. కానీ చిత్రంగా ముంబైలో ఉద్ధవ్ థాక్రే అనుచరులు మాత్రం గోమూత్రాన్ని రోడ్డంతా చిలకరించారు!
అసలే అక్కడ ఉద్ధవ్ థాక్రే, షిండేల మధ్య విభేదాలతో ఇరువర్గాల వారూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అది ఇప్పుడు మరింత రోడ్డు మీదకి వచ్చేసింది. తమ నాయకుడిని గద్దె దించాడని థాక్రేవర్గీయులు పీక ల్లోతు కోపంతో ఉన్నారు. షిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుచరులు థాక్రే వర్గీయుల పని పడుతున్నారు. థాక్రే వర్గీయులను ఆకట్టుకోవడానికి ఒక్కోరికి షిండే ఏకంగా రూ.50 కోట్లు ఇచ్చి నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు వీలయితే అప్పుడు ఇరువర్గాల వారూ కొట్లాటకీ దిగుతు న్నారు.
మొన్నీమధ్యనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఔరంగాబాద్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేసా రు. అది కాగానే షిండే, ఆయనతో వచ్చినవారంతా వెళిపోయారు. ఏదో పెద్ద దోషం జరిగినట్టు థాక్రే అను చరులు కొందరు వెంటనే ఆ ప్రాంత మంతా గోమూత్రంతో పరిశుద్ధి చేయడానికి పూనుకున్నారు. చిన్న చిన్న ప్లాస్టిక్ బకెట్లలో నీళ్లు, గోమూత్రం కలిపిన నీళ్లు తెచ్చి ఆ ప్రాంతమంతా చిలకరించారు. ఇంతకంటే వైరం మరోటి ఉండదు. థాక్రే, షిండేల మధ్య వైరం ఏ స్థాయిలో ఉందన్నది ఈ సంఘటన స్పష్టం చేసింది.