లాంఛనం పూర్తయ్యింది..ఈటల సస్పెండయ్యారు!
posted on Sep 13, 2022 @ 2:19PM
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు. ముఖ్యమంత్రి తలకుచుంటే ఎమ్మెల్యేకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఎంత మాత్రం లభించదు అని ఇప్పుడు అనుకోవలసిన పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస బహిష్కృతుడు ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించినా.. కేవలం కేసీఆర్ కు ఇష్టం లేని కారణంగా ఇప్పటి వరకూ అసెంబ్లీలో కూర్చో లేని పరిస్థితి. తాజాగా ఆయనను మంగళవారం (సెప్టెంబర్ 13) మరో సారి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
ఆయన సభలోకి అడుగుపెట్టకుండానే.. అంటే అసెంబ్లీ సెషన్ ప్రారంభం కావడానికి ముందే స్పీకర్ కార్యాలయం నుంచి ఈటలపై సస్పెన్షన్ వేటు నిర్ణయం వెలువడింది. అసలు ఆయనను సోమవారమే (సెప్టెంబర్ 12)సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. అయితే సోమవారం ఈటల సభకురాకపోవడంతో ఆయన సస్పెన్షన్ విషయాన్ని అధికార టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. కాగా ఈటల సోమవారం సభకు గైర్హాజర్ కావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వాటికి చెక్ పెట్టేందుకా అన్నట్లుగా మంగళవారం సభకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అధికార పక్షం మాత్రం ఆయనకు ఆ అవకావం ఇవ్వలేదు.
అసెంబ్లీకి వచ్చిన ఈటలను పోలీసులు బలవంతంగా సభ నుంచి బయటకు పంపేశారు. అసెంబ్లీకి వెళుతున్నట్లుగా ఈటల మీడియాకు సమాచారం అందించడంతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతకీ ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ వేటుకు కారణమేమిటంటే.. సభ ప్రారంభం రోజున బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులకు ఆహ్వానం అందకపోవడంపై ఈటల విమర్శించడమే. బీఏసీ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడంపై ఈటల స్పీకర్ మరమనిషి అని ఈటల చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ మండిపడింది. తన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణ చెప్పాలనీ, లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తప్పవనీ హెచ్చరించింది.
అయితే క్షమాపణ చెప్పేందుకు ఈటల నిరాకరించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు అనివార్యమని అంతా ఊహించారు. అందరూ ఏం ఊహించారో అదే జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఈటల అసెంబ్లీకి హాజరు కాకుండా కుట్ర చేస్తున్నారనీ, ఆయన గొంతు నొక్కేయాలని చూస్తున్నారనీ బీజేపీ విమర్శిస్తున్నది. గత సమావేశాలలో బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న కారణంతో స్పీకర్ పోచారం సభ నుంచి బీజేపీ సభ్యులు ముగ్గురినీ ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను సస్పెండ్ చేశరు.
ఇక ప్రస్తుత సమావేశాలకు వచ్చే సరికి ఈటల సస్పెండ్ కాగా, మరో ఎమ్మెల్యే రాజాసింగ్ జైలులో ఉన్నారు. ఇక సభలో మిగిలిన ఏకైక సభ్యుడు రఘునందనరావు మాత్రమే. ఇలా ఉండగా కేసీఆర్ కు ఈటల పట్ల ఉన్న అయిష్టత కారణంగానే ఆయనపై పదే పదే సస్పెన్షన్ వేటు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.