బుద్ధవనంలో అనేక పర్యాటక ప్రత్యేక ఆకర్షణలు
posted on May 15, 2024 @ 10:55AM
అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ఈమని శివనాగిరెడ్డి
నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బుద్ధవనం-వారసత్వ ఉద్యానవనం అనేక పర్యాటక ప్రత్యేకతలతో, మన దేశంలోనే కాక, ఆసియా దేశాలో కూడా విలక్షణ బౌద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందని, బుద్ధవనం బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ , బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మయన్మార్ దేశాల పర్యాటక నిర్వాహక సమాఖ్య సంయుక్తంగా మంగళవారం( మే 14) హోటల్ హై ల్యాండ్ లో నిర్వహించిన 'ప్రమోషన్ ఆఫ్ బుద్ధిష్ట్ సెక్టార్స్ త్రూ ఆసియా హైవే' అన్న అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరై ప్రసంగించారు.
పశ్చిమ బెంగాల్ సహా వివిధ ఆసియా దేశాల పర్యాటక ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రసంగించిన ఆయన తెలంగాణ పర్యాటక శాఖ, 274 ఎకరాల్లో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూప వనం, మహా స్థూపం, ఇంకా ప్రవేశ ప్రాంతంలోని బౌద్ధ పర్యాటక ఆకర్షణలతో సుందర తరంగా తీర్చిదిద్దిన బుద్ధవనం ఇప్పటికే అధిక సంఖ్యలో అంతర్జాతీయ, జాతీయ బౌద్ధ పర్యాటకులను ఆకర్షిస్తున్నదన్నారు. ఆసియా హైవేకి బుద్ధవనాన్ని అనుసందించాలని సదస్సు నిర్వహకులకు విజ్ఞప్తి చేశారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కౌలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను వివరించగా, అసోసియేషన్ గౌరవ కార్యదర్శి, పూర్వ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ హ్యాపీ ఇండెక్ యాత్రను భూటాన్ వరకు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంపాదకుడు, కే రామచంద్ర మూర్తి, బౌద్ధ అభిమాని కేకే రాజా, ఆల్ ఇండియా పురాతన దేవాలయాల జీర్ణోదరణ సమితి అధ్యక్షుడు ఆర్కే జైన్, ఇంకా సిలిగురి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.