జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్షమాభిక్ష!
posted on Mar 5, 2025 @ 2:07PM
ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి ఆ తరువాత అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని క్షమించి వదిలేయడం కంటే పెద్ద శిక్ష ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అలాంటి శిక్షను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహనరెడ్డికి వేశారు. సభా ముఖంగా జగన్ తప్పులను, తప్పిదాలను ఎత్తి చూపి, స్పీకర్ స్థానంలో ఉన్న తనకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించారని చెప్పారు. అయినా తాను జనగ్ ను క్షమించేస్తున్నానంటూ తన ఉదారతను చాటుకున్నారు. ఔను వైసీపీ అధనేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అక్కడితో ఆగకుండా జగన్ ఇప్పటికైనా మారాలనీ, తన దృక్ఫథాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.
అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు బుధవారం (మార్చి 4) మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పీకర్ స్థానానికి దురుద్దేశాలు ఆపాదించారని వెల్లడించారు. ప్రత్యేక హోదా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు స్పీకర్ కు నోటీసులు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు సభ వేదికగా చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవమన్న అయ్యన్న పాత్రుడు, హైకోర్టు నుంచి తనకు ఎటువంటి నోటీసులూ రాలేదన్నారు.
మొత్తంగా తప్పుడు వ్యాఖ్యలు, అవాస్తవ ప్రచారం చేస్తూ సభాగౌరవాన్ని మంటగలుపుతున్న జగన్ పై స్పీకర్ గా చర్యలు తీసుకునే అధికారం, అవకాశం తనకు ఉన్నప్పటికీ.. జగన్ చేస్తున్నవన్నీ సంధి ప్రేలాపనలుగా భావిస్తే ఆయనను క్షమించి వదిలే స్తున్నానని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇకనైనా జగన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలు కుతూ, ఇక ముందు కూడా జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే ఏం చేయాలన్నది సభ నిర్ణయిస్తుందని హెచ్చరించారు.