ఏపీ సర్కార్ హ్యాండ్సప్.. నెల్లూరులో సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్
posted on May 18, 2021 @ 4:26PM
ఆంధ్రప్రదేశ్ కరోనా కల్లోలంతో అల్లాడుతోంది. దేశంలో ప్రస్తుతం రోజువారి కరోనా మరణాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏపీలో పాజిటివిటి రేటు కూడా ప్రమాదకరంగా ఉందని కేంద్ర వైద్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా కొవిడ్ రోగుల చికిత్స విషయంలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ కోసం అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో.. కొందరు బాధితులు సోనూ సూద్ ను ఆశ్రయిస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం మనసున్న మారాజుగా నిలిచారు సోనూ సూద్. ఎవరూ సాయం అడిగినా వెంటనే స్పందిస్తున్నారు. సాయం కావాళ్లన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా తన సేవలను విస్తరించారు. ఏ ప్రాంత నుంచి తనకు అభ్యర్థన వచ్చినా వెంటనే వారికి సాయం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలే అందరికీ సాయం చేయాలి.. కానీ ఆ ప్రభుత్వాలు కూడా సోనూ సూద్ సాయం కోరుకుతున్నాయి అంటే.. అతడు చేస్తున్న సేవ ఎలాంటిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ జనరేటర్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు రియల్ హీరో. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్.. విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో చనిపోయారు.. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణమైంది. దీంతో తీవ్ర కలత చెందిన సోనూ సూద్ మిత్రుడు సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లాడు. సోనూతో ఫోన్‌లో మాట్లాడించాడు. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, లేదంటే కావలిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నారు. సోనూ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను సూద్ అందిస్తున్నారని చెప్పారు. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.