డిఎస్‌పై కెటిఆర్ ధ్వజం
posted on Nov 2, 2011 @ 3:54PM
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాపకంతో మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సంపాదించారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ విమర్శించారు. బంగారు పల్లెంలో తెలంగాణ తీసుకు వస్తానని చెప్పిన డిఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా తీసుకు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పక్కన పెట్టి కంచుపల్లెంలో ఎమ్మెల్సీ మాత్రం తెచ్చుకున్నారన్నారు. డిఎస్ ఎమ్మెల్సీని ఎలా దక్కించుకున్నారో, సోనియా కూడా తెలంగాణ ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. రాజీనామాలతో తెలంగాణ రాదని ఎలా చెప్పగలరన్నారు.తెలంగాణ వ్యతిరేకులైన ఐపిఎస్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్న అధికారులకు నిబంధనలు వర్తించవా అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షలు ఉన్నందుకే తమ దీక్షలను వాయిదా వేసుకున్నామన్నారు.