విమర్శలు తప్ప ఒరిగేదేం లేదు
posted on Aug 14, 2015 @ 3:34PM
కాంగ్రస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. సెలవులకంటూ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ తిరిగొచ్చిన తరువాత ఏమయిందో ఏమో కానీ బాగానే ప్రతిపక్షాలకు ధీటుగా రాజకీయ వ్యూహాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి పార్లమెంట్ సమావేశాలే నిదర్శనమని చెప్పవచ్చు. భూసేకరణ బిల్లుపై.. లిలిత్ మోదీ వ్యవహారంపై పార్లమెంట్లో చేసిన గందరగోళం అంతా ఇంతా కాదు. గత నెలలో ప్రారంభమైన వర్షకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి.. కానీ ఈ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి మొత్తం సారధ్యం వహించింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తనయుడు రాహుల్ గాంధీ అని అందరికీ అర్ధమవుతోంది.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలం పాటు నోరు మెదపకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన దూకుడుని ప్రదర్శిస్తుంది. ఇప్పటికే పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఉనికి లేకుండా పోయింది.. ఇంకా అలానే ఉంటే భవిష్యత్ లో పార్టీ ఉంటుందో లేదో అని అనుకున్నారమే కానీ తల్లి సోనియా.. తనయుడు రాహుల్ కలిసి పార్టీని కాపాడటానికి చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. వారితో పాటు కాంగ్రెస్ నేతలను కూడా పరుగులు పెట్టిస్తూ ధర్నాలంటూ, నిరసనలంటూ చెమటలు పట్టిస్తున్నారు.
కానీ అధికారం ఉన్నప్పుడు చేయనివారు.. అధికారం లేని తరువాత ధర్నాలు నిరసనలు చేస్తే ప్రశంసించే వాళ్ల సంగతేమో కాని విమర్శించేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. దానికి కారణాలు లేకపోలేదు.. అసలు యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నన్నీ రోజులు రైతులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. కానీ అప్పట్లో అధికారంలో ఉన్నారు కదా అని పట్టించుకోలేదు. ఇప్పుడు రైతు ఆత్మహత్య భరోసా అంటూ రైతుల కుటుంబాలను పరామర్శిస్తే మాత్రం ప్రతిపక్షాలు విమర్శించకుండా ఉరుకుంటాయా. అదే విధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంపీలను సస్పెండ్ చేసి విభజన బిల్లు ఆమోదం పొందేలా చేశారు సోనియాగాంధీ.. ఇప్పుడు తమ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ప్రజాస్వామ్యం చనిపోయిందంటూ మొత్తుకుంటూ ధర్నాలు చేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు. పైగా ఈ విషయంపై సోనియాగాంధీపై చాలా మంది అప్పడు గుర్తుకు రాని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ చురకలు వేశారు. ఇదిలా ఉండగా తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. దీనిలో భాగంగా రాహుల్ గాంధీ ఏపీలో ధర్నా కూడా చేయాలని నిర్ణయించుకున్నారంట. రాష్ట్రాన్ని విభజించినందుకే కాంగ్రెస్ పార్టీ పై పీకల్లోతు కోపంతో ఉన్న ఏపీ జనాలు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో ప్రత్యేక హోదా కోసం ఏపీలో ధర్నా చేస్తే మాత్రం వారిని ఆదరిస్తారా.. ఇప్పటికే ఈ విషయంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ ఏదో ఆవేశ పడిపోయి తమ పార్టీని ఉనికిని ప్రజల్లోకి తీసుకురావడానికి ఈ పనులన్నీ చేయడం తప్ప దీని వల్ల వారికి విమర్శలు తప్పితే ఒరిగేదేమీ లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్ని చేసినా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కల్ల అంటున్నారు రాజకీయపెద్దలు.