సిట్, ఈడీల సమన్వయం.. ఏపీ లిక్కర్ స్కాం నిందితుల్లో భయం భయం!
posted on Sep 19, 2025 @ 2:12PM
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సిట్, ఈడీలు ఏకకాలంలో దూకుడు పెంచడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఖంగారు పెరిగిపోతున్నది. ఒక వైపు సిట్ ఈ కేసు దర్యాప్తులో మద్యం కుంభకోణం సొమ్ము అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చే దిశగా దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ ఈ మద్యం స్కాంకు సబంధించిన మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందో తేల్చే పనిలో పడింది. అందులో భాగంగానే ఈడీ గురువారం (సెప్టెంబర్ 18) ఏకకాలంలో పలు రాష్ట్రాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో వైసీపీ పెద్దల్లో ఒక్కసారిగా కంగారు మొదలైంది.
ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని భావించిన ఈ కేసులో నిందితులు.. ఈడీ ఎంట్రీతో స్కాం చెయిన్ గుట్టు మొత్తం రట్టౌంతుందన్న ఆందోళనలో పడ్డారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఇంకా సమన్లు అందుకోని వారూ, సిట్ రాడార్ లోకి రాలేదని సంబరపడుతున్నవారు ఉలిక్కి పడుతున్నారు. దర్యాప్తు తమ దాకా రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న ఆందోళనలో పడ్డారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఈడీ పక్కా సమాచారంతో, అంతకు మించి పక్కా ప్రణాళికతో సోదాలు నిర్వహిస్తున్నట్లు గురువారం (సెప్టెబర్ 18) సోదాలను గమనిస్తే అర్ధమౌతోంది. లిక్కర్ స్కాము సొమ్ములు ఎవరెవరికి చేరాయి. బ్లాక్ ను వైట్ ఎలా చేశారు. అందుకోసం ఎవరెవరు ఎన్నెన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారు. వంటి మొత్తం సమాచారం దగ్గరుంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ తరహాలో ముందుకు వెడుతున్న ఈడీ మద్యం స్కాం సూత్రధారి ఎవరు అన్నది గుర్తించడానికి ఎంతో కాలం పట్టదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సిట్, ఈడీలు పూర్తి సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నాయని అవగతమౌతోందని అంటున్నారు. మనీలాం డరింగ్ ద్వారా విదేశాలకు నగదు ఎలా వెళ్లింది అన్న విషయంపై దర్యాప్తు చేసిన ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు అలా విదేశాలకు వెళ్లిన సొమ్ము వైట్ గా మారి ఎక్కడికి ఎలా చేరిందన్న విషయంపై దృష్టిసారిస్తుందని అంటున్నారు.