ఇష్టసఖికి ఝలక్ ఇచ్చిన జయ
posted on Dec 19, 2011 @ 3:43PM
చెన్నై : ఇష్టసఖి శశికళపై అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేటు వేశారు.ఈ చర్య వలన జయలలిత మరో సంచలనానికి తెరదీశారు. ఈ చర్యతో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నాయి. అయితే శశికళను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ పార్టీ వర్గాలు మాత్రం ఇంకా ఆ విషయాన్ని ధృవీకరించలేదు. శశికళతో పాటు పన్నెండు మంది పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అందులో పెంపుడు కొడుకు కూడా ఉన్నట్లు సమాచారం. శశికళతో జయలలితకు ముప్పయ్యేళ్ల బంధం ఉంది. కష్టకాలంలో శశికళ జయకు అండగా ఉన్నారు. రాజకీయంగా, కేసులపరంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె నుండి శశికళ దూరం పోలేదు. అలాంటి శశికళపై వేటు వేయడం సంచలనం సృష్టిస్తోంది.కాగా వీరి బహిష్కరణకు కారణాలను మాత్రం పార్టీ వెల్లడించలేదు. జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఐఏఎస్ అధికారులు నేరుగా శశికళకు రిపోర్టు చేస్తున్నారని అన్నాడీఎంకెలో గత కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగేతర శక్తిగా ఎదగడం జీర్ణించుకోలేని జయలలిత ఆమెను సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వేటు వేయటమే కాకుండా వారితో ఎవరైనా మాట్లాడితే వాళ్లపైనా చర్యలు తీసుకుంటానని పార్టీ కేడర్‌ను ఈ సందర్భంగా అధినేత్రి హెచ్చరించారు.శశికళను జయలలిత దూరం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 1996 ఎన్నికల్లో ఓటమి, అరెస్ట్ ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన జయ ఇష్టసఖిని దూరం పెట్టడమే కాకుండా పోయిస్ గార్డెన్ లోకి అనుమతించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య రాజీ కుదిరింది.
కాగా శశికళపై వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అక్రమాస్తుల కేసు నుండి బయటపడేందుకే జయ వేసిన ఎత్తుగడ అని, శశికళపై ఆస్తుల కేసు మోపేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.