జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి షర్మిల శంఖారావం!
posted on Jan 4, 2024 @ 11:48AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , తన సోదరుడు వైఎస్ జగన్ తో వైఎస్ షర్మిల ప్రత్యక్ష యుద్ధానికి శంఖారావం మోగించేశారు. తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా ఆమె పూర్తిగా కాంగ్రెస్ నాయకురాలిగా పరివర్తనం చెందారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తాను జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ నాయకుడే ఆయినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం ఆయన కుమారుడు జగన్ సొంతంగా వైసీపీ పార్టీని స్థాపించి వైఎస్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో వైఎస్ భార్య విజయమ్మ, తనయ షర్మిల కూడా జగన్ తో పాటే అడుగులు వేశారు. దాంతో వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయింది.
అయితే ఇప్పుడు వైఎస్ తనయ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి వైఎస్ కలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించడం ద్వారా మళ్లీ వైఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టేశారు. మరో వైపు వైఎస్ కుమారుడు జగన్ తన పాలనా వైఫల్యాలతో వైసీపీకి వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని తుంచేశారు. వైఎస్ అనుచరులు, అభిమానులూ కూడా వైసీపీ వైఎస్ రాజకీయ పరంపరను కొనసాగించడం లేదని బాహాటంగానే చెబుతున్నారు. ఇక వైఎస్ కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా జగన్ కు దూరం అయ్యారు. దీంతో వైసీపీకి వైఎస్ రాజకీయ సిద్ధాంతానికీ ఉన్న సంబంధం కూడా పుటుక్కుమని తెగిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. అటువంటి తరుణంలో షర్మిల తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానంటున్నారు. దీంతో ఇక షర్మిలే వైఎస్ రాజకీయవారసురాలిగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఏపీలో రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసినట్లైంది. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎంగా జగన్ అన్ని రంగాలలో విఫలమయ్యారు. దీంతో విపక్ష తెలుగుదేశం రాష్ట్రంలో బలంగా పుంజుకుంది. మరో ప్రతిపక్షం జనసేన కూడా తెలుగుదేశంతో చేతులు కలిపింది. ఇక జనగ్ పార్టీలో అసమ్మతితో రగిలిపోతున్న వారందరికీ ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేన పార్టీలలో ఒక దానిలో చేరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో జగన్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి వాదులందరికీ ఇప్పుడు తమ రాజకీయ గమ్యం కాంగ్రెస్ గా మారిపోయింది.
దీని వల్ల విపక్ష కూటమి తెలుగుదేశం, జనసేనకు రెండిందాల మేలు జరుగుతుంది. ఒకటి వైసీపీ నుంచి కుప్ప తెప్పలుగా వచ్చి పడే అసమ్మతి నేతలను తమ పార్టీలలో ఎలా అకామిడేట్ చేయాలా అన్న మీమాంస పోతుంది. రెండు జగన్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య పెరగడంతో.. జగన్ ఓటు వైసీపీ, కాంగ్రెస్ ల మధ్య చీలిపోయి.. వైసీపీని మరింత బలహీనం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమికి దఖలు పడిపోయిందని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి.తటస్థులూ జగన్ పాలనకు చరమగీతం పాడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఏపీలో జగన్ కు పడే ఓట్లేమైనా ఉన్నాయంటే.. అవి కాంగ్రెస్ ఓట్లే.. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ ఓటు మళ్లీ కాంగ్రెస్ పార్టీకే వెడుతుందని విశ్లేషిస్తున్నారు. తాజా సర్వేలలో వచ్చే ఎన్నికలలో వైసీపీ 9శాతం ఓట్లు కోల్పోతుందని తేలింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తే వైసీపీ కోల్పోయే ఓట్ల శాతం మరింత పెరుగుతుందని అంటున్నారు. షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ కు ఇప్పటికిప్పుడు అంటే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు కానీ, వైసీపీని వెనక్కు నెట్టి రెండో స్థానంలో బలంగా నిలబడేందుకు దోహదపడుతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.