లోకసభ ఎన్నికలలో 15 కాంగ్రెస్ ఒకటి సిపిఐ... రేవంత్ వ్యూహం ఇదేనా ?
posted on Jan 4, 2024 @ 12:00PM
తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ తో పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో గెలుపొందే దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో ఎన్డిఏ కూటమిని దించడానికి ఏర్పాటైన ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం కావడంతో మరింత ఉత్సాహంతో అడుగులు వేస్తోంది.
తెలంగాణలో మొత్తం 17 లోక సభ నియోజకవర్గాలలో 15 స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికలలో సిపిఐతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా మిత్ర ధర్మం పాటించాలని కాంగ్రెస్, సిపిఐలు భావిస్తున్నాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కమ్యూనిస్ట్ లకు కంచుకోట అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో తాను పోటీ చేసిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సిపిఐ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావ్ తరపున నారాయణ విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యమాలే ఊపిరిగా ప్రజా క్షేతంలో ఉన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను తెలంగాణలో కనిపించకుండా బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ వేసిన స్కెచ్ లో సిపిఐ,సిపిఎం పార్టీలు బలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్ ) అభ్యర్థి గెలుపుకు కృషి చేశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా మిత్రధర్మాన్ని పాటించాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనుకున్నప్పటికీ కెసీఆర్ పొమ్మనక పొగ బెట్టాడు. కమ్యూనిస్ట్ లను దగ్గరకు రానీయకపోవడానికి మరో కారణం ఉంది. దేశ రాజకీయాల్లో బిజెపి కూటమి ఎన్ డి ఏ వర్సెస్ కాంగ్రెస్ కూటమి ఇండియా ఉంది. ఇండియా కూటమిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఈ కారణంగానే బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎటువంటి చర్చలు జరపకుండా మొత్తం 119 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇండియా కూటమికి నేతృతం వహిస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఆపన్న హస్తం అందించింది. సీట్ల సర్దుబాటులో కొత్తగూడెం సిపిఐ కి కేటాయించింది. 1999 అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థిగా గెలిచిన కూనంనేని సాంబశివరావు కే ఈ సారి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఈ ఎన్నికలలో బిజెపి బి టీం బిఆర్ఎస్ అని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యింది. రాజకీయాలలో టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన కెసీఆర్ ఈ ఎన్నికలలో హ్యట్రిక్ కొట్టాలని ఆశించి భంగపడ్డారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ కనబడకుండా కెసీఆర్ వేసిన ఎత్తుగడ. మెజార్టీ స్థానాలు టిఆర్ఎస్ గెలిచినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ వేవ్ తీవ్రంగా ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కమ్యూనిస్ట్ లు కాంగ్రెస్ ను గెలిపించారు. సీట్ల సర్దుబాట్లలో సిపిఎం కు మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చినప్పటికీ సిపిఎం కినుక వహించి వైదొలగింది. సిపిఎం ఒంటరిగా 19 స్థానాల్లో పోటీచేసి అన్ని స్థానాల్లో ఓడిపోయింది. లోకసభ ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ పార్టీతో మైత్రి కొనసాగించాలని సిపిఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.