తీవ్ర తుపానుగా మారిన మొంథా!.. ఏపీకి రెడ్ అలర్ట్
posted on Oct 28, 2025 @ 9:52AM
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్నది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాన్.. తీవ్ర తుపానుగా బలపడి వేగం పెంచుకుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మెంథా తుపాన్ ఈ సాయంత్రానికి లేదా రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుందనీ, అలాగే గంటకు వంది కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు వీస్తాయనీ తెలిపింది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అలాగే చెట్లు, హోర్డింగుల సమీపంలో ఉండరాదని తెలిపింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయనీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ జిల్లాలతో పాటు యానాం, దక్షిణ ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తీర ప్రాంతాలలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగినపూడి వద్ద సముద్రం 500 మీటర్లు ముందుకు వచ్చింది.
ఇక విశాఖపైనా మొంథా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు 8 నుంచి 10 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. రాకాసి అలలు, భీకర గాలులతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో విశాఖలో జనజీవనం స్తంభించింది. అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాల ఉద్ధృతి పెరిగింది. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు కెరటాల ఉద్ధృతికి ధ్వంసమైంది. ఉప్పాడ తీరం భారీగా కోతకు గురవుతోంది.