పశ్చాత్తాపడుతున్నారు.. ప్రాయశ్చితం చేసుకుంటామంటూ బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు!
posted on Mar 2, 2024 8:02AM
రాష్ట్రం అభివృద్ధికి నిరంతరం కృషిచేసిన నేత.. ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రతి క్షణం తాపత్రయ పడిన నాయకుడు, ప్రపంచ దేశాల్లో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఐటీ మాస్టర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి. ఆయన ఎవరోకాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ, ఏపీ ప్రజలతోపాటు, ఏపీతో సంబంధం కలిగిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నారు. ఇన్నాళ్లూ జగన్ మోహన్ రెడ్డిని వెనుకేసుకొచ్చిన పలువురు వైసీపీ నేతలు సైతం ఈసారి ఏపీకి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ కోరుకుంటున్నారు. కొందరైతే చంద్రబాబును ఇన్నాళ్లూ విమర్శించినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. దీనంతంటికీ కారణం ఏపీ అభివృద్ధికి ఐదేళ్లు చంద్రబాబు నాయుడు చేసిన కృషితోపాటు.. ప్రస్తుతం నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన. 2014 నుంచి 2019 వరకు ఏపీలో సందడి వాతావరణం ఉండేది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు. రోజుకు 18 గంటలపాటు అనుక్షణం రాష్ట్రం అభివృద్ధి కోసం బాబు పనిచేశారు. ఒకవైపు పోలవరం, మరోవైపు అమరావతి రాజధాని, ఇంకో వైపు ప్రాజెక్టుల నిర్మాణం.. మరో వైపు రైతుల అభ్యున్నతికి కృషి.. ఇలా అన్ని రంగాల్లోనూ ఏపీని అభివృద్ధి పథంలో చంద్రబాబు నడిపించారు. అంతేకాదు.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పెద్దపెద్ద కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చంద్రబాబు చేసిన కృషి అమోఘం. కానీ, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో ఏపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి చేరింది. కనీసం రోడ్లు వేసేందుకు సైతం వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే జరిగాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు వైసీపీ హయాంలో వెనక్కు వెళ్లిపోయాయి. యువత పని చేసుకునేందుకు కనీసం ఉపాధి లేకుండా పోయింది. దీంతో అన్ని వర్గాల నుంచి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకుంటే రాష్ట్రం పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న ఆవేదనను ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు జగన్ కు అండగా నిలుస్తూ.. సోషల్ మీడియాలో చంద్రబాబును విమర్శించిన వైసీపీ సానుభూతిపరులు సైతం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ సీఎం గా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోని పలు ప్లాట్ ఫాంల ద్వారా పలువురు వైసీపీ సానుభూతి పరులు ఇన్నాళ్లు చంద్రబాబును విమర్శించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పలువురు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు జపం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వైసీపీ సానుభూతిపరుడు పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఆయన ఆ పోస్టులో చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి చెబుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు విమర్శించడానికి గల కారణం.. ప్రస్తుతం చంద్రబాబుకు మద్దతుగా నిలవడానికి కారణాలను వివరించాడు.
చంద్రబాబు గొప్పతనం గురించి వైసీపీ సానుభూతిపరుడు సోషల్ మీడియాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. తాను వైసీపీలో ఉన్నప్పుడు పని మీద ఏలూరు వైపు వెడుతున్న సమయంలో అటువైపు వరి పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. ఒక పొలంలో కర్రతో పాతిన ఒక బోర్డ్ కనిపించింది.. బహుశా చంద్రబాబు అభిమాని అయి ఉంటాడు. ఆ బోర్డ్ మీద "ఈ పంటను పట్టిసీమ నీటితో పండించాము" అని రాసి ఉంది. దాన్ని ఫోటోతీసి గౌతమి ఐడీలో పట్టిసీమ మీద, చంద్రబాబుపై వెటకారంగా పోస్ట్ పెట్టింది.. 700పైనే లైక్స్ వచ్చాయి. ఈ ఐదేళ్ళలో జగన్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటికూడా లేకపోగా.. ఉన్న ప్రాజెక్టులతోపాటు వాటి గేట్లు కూడా కొట్టుకు పోతుంటే చంద్రబాబు గొప్పతనం, ఆయన కట్టిన పట్టిసీమ గొప్పతనం ఏంటో బాగా తెలిసి వచ్చింది. చంద్రబాబు పాలనలో ప్రతి ఇంటికి మరుగు దొడ్డి కట్టిన రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని న్యూస్ వచ్చింది. ప్రతి ఇంటికీ మరుగు దొడ్లు కట్టే పనిలో భాగంగా చంద్రబాబు ఒక బాత్రూమ్ దగ్గర దిగిన ఫోటోను తాను ట్రోల్ చేసిన తీరు తలుచుకుంటే చాలా బాధ కలుగుతోందని సదరు వ్యక్తి ఆవేదనను వ్యక్తం చేశారు. పశ్చాత్తాపపడ్డారు. అంతేకాదు, అప్పట్లో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేసినా వెటకారంగా ట్రోల్ చేసేవాడిననీ, చంద్రబాబు రోజుకి 18గంటలు పని చేస్తాడని రాత్రి 2గంటల వరకు పని చేస్తున్నట్టు వెనుక వైపు గడియారంలో టైమ్ కనిపిస్తున్న ఫోటోను కూడా చాలా వెటకారంగా ట్రోల్ చేస్తే అది కూడా వైరల్ అయిందనీ ఆ పోస్టులో పేర్కొని, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకురాని, సాయంత్రం 6 గంటలు దాటితే మంచం ఎక్కేసే జగన్ ను చూస్తుంటే .. రేయింబవళ్ళు కష్టపడి పనిచేసిన చంద్రబాబునా తాను ట్రోల్ చేసింది అని తన మీద తనకే అసహ్యం కలుగుతోందంటూ కన్ఫెస్ అయ్యారు.
మళ్ళీ చంద్రబాబు ఎప్పుడు సీఎం అవుతారా? సీఎం అయిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి గురించి గొప్పగా ప్రచారం చేసి గతంలో నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నానని ఆ పోస్టులో పేర్కొన్నారు. తెలుగుదేశం విజయం సాధిస్తే తనకేవో పదవులు వస్తాయన్న కోరిక తనలో ఇసుమంతైనా లేదనీ, తాను తెలుగుదేశం పార్టీలో చేరడానికి గతంలో తాను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలన్న బలమైన ఆకాంక్షే కారణమని విస్ఫష్టంగా పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి అయినా సరే చంద్రబాబు విజయంకోసం పని చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యాను. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని పేర్కొన్నారు. అందుకే కేసులు పెట్టి లోపల వేసినా కూడా జైల్లో వెయ్యక ముందు కంటే కూడా వేసిన తర్వాతనే మరింత కసిగా పని చేస్తున్నాను అటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. జగన్ పాలనపై విమర్శలు చేశాడు. ఇలా ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రజావ్యతిరేక పాలనపై విసిగిపోయారు. గతంలో జగన్ కోసం పని చేసిన వారు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు పడిన తపనను, చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ, మళ్లీ నువ్వేరావాలి బాబూ అంటూ తెలుగుదేశం విజయం కోసం తపిస్తున్నారు. అందుకోసం నిస్వార్థంగా పని చేసేందుకు సమాయత్తమౌతున్నారు.