బయటికొస్తే బండి సీజ్.. పోలీస్ యాక్షన్ షురూ..
posted on May 20, 2021 @ 11:22AM
తెలంగాణలో రోజుకు సుమారు 4వేల కేసులు. గత కొన్ని వారాలుగా ఇదే సంఖ్య. లాక్‌డౌన్‌కు ముందు ఇన్నే కేసులు వచ్చేవి. లాక్‌డౌన్ టైమ్‌లోనూ అవే కేసులు. ఎందుకిలా? రోజులో 20 గంటలు లాక్‌డౌన్ అమలు అవుతుండగా.. జనమంతా ఇళ్లలోనే ఉండగా.. మరి కేసులెందుకు తగ్గట్లేదు? లాక్‌డౌన్ సరిగా అమలు అవడం లేదా? ప్రజలు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్నారా? తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా? లాక్‌డౌన్ అమలులో పోలీసులు ఫెయిల్ అయ్యారా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.
తెలంగాణలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంది. ఆ నాలుగు గంటలు అన్ని రకాల షాపులు తెరిచే ఉంటాయి. ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు ఉండవు. అంటే, ఆ నాలుగు గంటలు ఇష్టారాజ్యం. ఎప్పటిలానే బయట తిరగొచ్చు. షాపులకు వెళ్లొచ్చు. కావలసిన పనులు చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు కొంప ముంచుతోందని అంటున్నారు. నగరాల్లో ఉదయం 6 గంటలకు లేచేవాళ్లు తక్కువే ఉంటారు. 8 అయితే గానీ బయటకు రారు. అందుకే, ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య రోడ్లు, షాపుల్లో జనాలు ఫుల్‌గా ఉంటున్నారు. ఇదివరకు రోజంతా జరిగే వ్యాపారం ఇప్పుడు ఆ రెండు గంటల్లోనే జరుగుతోంది. టైమ్ తక్కువగా ఉండటంతో.. రద్దీ ఎక్కువవుతోంది. ఇక ఆదివారం వచ్చిందంటే అంతే సంగతి. నాన్‌వెజ్ మార్కెట్లు, కూరగాయల షాపులు కిక్కిరిసిపోతున్నాయి. నడవడానికే ప్లేస్ లేనంత జనం. హైదరాబాద్‌లోని ఓ మటన్ షాపులో ఆదివారం వస్తే రోజంతా కలిసి దాదాపు 150 కిలోల మటన్ అమ్మేవాళ్లు. ఇప్పుడు అదే షాపులో ఉదయం 10 లోపే ఆ 150 కిలోల మటన్ అమ్మేస్తున్నారట. అంటే, ఆ నాలుగు గంటల్లో ఎంత రద్దీ ఉంటుందో.. జనాలు ఎంతగా కిక్కిరిసి కనిపిస్తారో ఊహించుకోవచ్చు. ఇలా.. ఉదయం 8 నుంచి 10 గంటల సమయం రద్దీతో వైరస్ ముప్పు మరింత పెరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అందుకే.. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో లాక్‌డౌన్ పర్యవేక్షణపై రివ్యూ నిర్వహించారు. ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయట తిరిగే వాహనదారుల్ని గుర్తించి వారి వాహనాల్ని తాత్కాలికంగా జప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కాలనీలు, అంతర్గత రహదారుల్లో పోలీసు నిఘా విస్తృతం చేయాలని సూచించారు. కమిషనర్లు, ఏసీపీలు ఉదయం 9.45 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టంచేశారు. 10 గంటలకు అన్ని గస్తీ వాహనాలు సైరన్ మోగించాలని తెలిపారు.
కఠిన చర్యలతో పాటు పోలీస్ శాఖ తరఫున కొన్ని అవగాహనా కార్యక్రమాలూ చేపట్టనున్నారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచే బయటకువచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చైతన్యపరిచే అంశంపై దృష్టి సారించాలన్నారు. కరోనా వ్యాప్తికి అవకాశమున్న చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు ఆయా శాఖల అధికారులతో కలిసి వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కాలనీల వారీగా ఎక్కడికక్కడ సండే మార్కెట్లు ఏర్పాటు చేస్తే జనమంతా ఒకే చోట చేరే ముప్పు తప్పుతుందన్నారు డీజీపీ.
ఇప్పటి వరకూ 10 తర్వాత లాక్‌డౌన్ స్టార్ట్ కాగానే.. ప్రజలంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయేవారు. పోలీసులు సైతం.. లాక్‌డౌన్ మొదలైంది.. వీధుల్లో జనం లేరంటూ.. కాస్త రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయేవారు. అసలే ఎండాకాలం కావడంతో.. ఈ వేడిలో రోడ్లపై ఏం తిరుగుతామనే ఉద్దేశ్యంతో లాక్‌డౌన్ పర్యవేక్షణపై కాస్త ఉదాసీనంగా ఉండేవారు ఖాకీలు. ఎక్కడో జంక్షన్‌లో నీడ పట్టున కూర్చొని కనిపించేవారు. గల్లీల్లో గస్తీని పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో.. ప్రజలు అవసరం లేకపోయినా.. ఇంట్లో బోర్ కొడుతోందని వీధుల్లో తిరగడం మొదలుపెడుతున్నారు. ఫ్రెండ్స్, చుట్టాలింటికి అంటూ పోలీసుల కంటికి కనిపించకుండా బయటకు వస్తున్నారు. దీంతో, లాక్‌డౌన్ పెట్టినా ఉపయోగం లేకుండా పోతోంది.
లాక్‌డౌన్‌లోనూ కేసులు తగ్గకపోవడంతో సర్కారు సీరియస్‌గా ఉంది. పోలీసులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో.. స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డినే రంగంలోకి దిగారు. ఐటీ స్థాయి నుంచి ఎస్పీల వరకు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఇకపై లాక్‌డౌన్ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించారు. దీంతో.. ఫైన్ల మీద ఫైన్లు వేసి పైసా వసూల్ కార్యక్రమం మరింత ముమ్మరం చేయనున్నారు. అక్కడితో ఆగక.. ఉదయం 10 తర్వాత అనవసరంగా బండిపై బయటకు వస్తే.. ఏకంగా మీ వాహనం సీజ్ చేస్తారు పోలీసులు.. అప్పటికీ కేసులు కంట్రోల్ కాకపోతే.. తెలుసుగా ఇక చివరాఖరికి పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పదు.. గుర్తుందిగా.. గతేడాది లాక్‌డౌన్ లాఠీ దెబ్బ ఎలా ఉందో.. తస్మాత్ జాగ్రత్త..