Read more!

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ను కబళించిన కరోనా... సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి

కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారు ఝామున 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే . అయితే గత కొద్ది రోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అహ్మద్ పటేల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వారు పేర్కొన్నారు.
 

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తనకు నమ్మిన బంటులా ఉంటూ.. పార్టీ కష్టాల్లో పడిన వేళ తన చతురతతో సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించే అహ్మద్ పటేల్ మరణ వార్త తనను ఎంతో కలచి వేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘అహ్మద్ పటేల్ లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. అత్యంత నమ్మకమైన స్నేహితుడు. ఆయన జీవితం మొత్తాన్ని కాంగ్రెస్‌కే ధార పోశారు. పార్టీపట్ల అంకితభావం, విశ్వసనీయతతో ఉండటం, సహాయం చేయడానికి అందరికంటే ముందుండటం, కర్తవ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత, ఔదార్యం... ఇవన్నీ ఆయనలో ప్రత్యేక లక్షణాలు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ట్వీట్ చేశారు.
 

అహ్మద్ పటేల్ కరోనాతో మరణించడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఇది నిజంగా విషాదకర దినం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ ఓ మూలస్తంభం లాంటివారని" కొనియాడారు. "ఆయన శ్వాస, ఆశ అన్నీ కాంగ్రెస్ పార్టీయేనని కీర్తించారు. అనేక సంక్షోభ సమయాల్లో పార్టీకి వెన్నంటి నిలిచారని.. తమకు ఆయన ఓ ఆస్తిలాంటివారని" రాహుల్ అభివర్ణించారు.