తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగినంత మాత్రాన్న..
posted on Oct 24, 2013 @ 10:05AM
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ మళ్ళీ మరోమారు డిల్లీ యాత్రకి బయలుదేరుతున్నారు. రాష్ట్రవిభజనని ఆపమని రాష్ట్రపతిని కోరేందుకుట! దాదాపు 40 మంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. మరి వాళ్ళు ఆయనకి ఏమిచెపుతారో, అందుకు ఆయనేమి జవాబిస్తారో అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ తమ ప్రయత్నలోపం ఉండకూడదనే సదుదేశ్యంతోనే పాపం వారు అంత శ్రమ పడుతున్నారు.
ఇక మళ్ళీ మళ్ళీ అంత దూరం వెళ్లి రావడం కష్టం గనుక పనిలోపనిగా వారు కేంద్రమంత్రుల బృందాన్ని(జీవోఎం)ని కూడా కలిసి వారి చేతిలో తమ నివేదికలు పెట్టి రావాలని ఆలోచిస్తున్నారు. అయితే, దీనిని ప్రజలు కూడా ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే సంకుచిత దృష్టితో చూస్తూ, ‘ఒకపక్క సమైక్యాంధ్ర అంటూ మమ్మల్ని మభ్యపెడుతూనే మరో వైపు కేంద్రమంత్రుల బృందాన్నికలిసి తమ కోరికల చిట్టా (నివేదిక)ని వారి చెవులో వినిపించడం ద్వారా రాష్ట్ర విభజనకు తామంత సిద్దమేనని చెప్పినట్లే’ అని గగ్గోలు పెడితే అందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు బాధ్యులు కారు. ఎందుకంటే వారు రాష్ట్రవిభజన చేస్తే ఏమేమి సమస్యలు వస్తాయో తెలియజేసే నివేదికలను మాత్రమే మంత్రుల బృందానికి అందిస్తామని చెపుతున్నారు. అయినా కూడా వారి మాటలను నమ్మకుండా వాళ్ళు ఏవో నివేదికలు ఇచ్చేస్తారని మాట్లాడటం కేవలం ప్రతిపక్షాల కుట్రకాక మరేమిటి?
‘అయినా డిల్లీ వెళ్ళేది రాష్ట్రపతిని కలవడానికా లేక ఆ వంకతో కేంద్రమంత్రుల బృందాన్నికలిసి తమ కోరికల చిట్టాని వారిలో చెవులో వేయడానికా?’ అని ప్రజలు కూడా ఆవేశపడిపోవడం కేవలం ప్రతిపక్షాల కుట్రగానే చెప్పవచ్చును.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ చాలా మడిగా, చిత్తశుద్దితో రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దని కోరుతున్నపుడు కూడా వారి చిత్తశుద్దిని ప్రజలు శంఖించడం సున్నితమయిన వారి మనసులను నొప్పించే అవకాశం ఉంది. సమైక్యం కోసం ఎంత కష్టపడినప్పటికీ ప్రజలు తమను అనుమానిస్తున్నందుకు పురందేశ్వరి మేడం చాల బాధపడిన సంగతి ప్రజలు మీడియాలో చూసారు కూడా. అయితే సోనియమ్మ మనసెరిగిన చినమ్మ ‘విభజన పక్కా’ అని గ్రహించగలిగినందునే విధిలేని పరిస్థితుల్లో విభజనకు 'సై' అనవలసి వచ్చిందని ప్రజలకీ అర్ధం అయ్యే ఉంటుంది.
అటువంటప్పుడు రాష్ట్ర విభజనకు 'సై' అంటున్న పురందేశ్వరో, పనబాకో, కిల్లీ రాణీగారో, శీలం బాబుగారో, కావూరి సాంభశివుడో, లేక వేరే ఏ జీవో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వెంట ఉండి ఉంటే వారిని అనుమానించినా అర్ధం ఉంది. గానీ వారెవరూ లేకపోయినా వారికంటే ముందుగానే మన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కేంద్రమంత్రుల బృందాన్నికలిసినంత మాత్రాన్న వారిని అపార్ధం చేసుకోవడం చాలా అన్యాయమని చెప్పక తప్పదు. ఎందుకంటే తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగినంత మాత్రాన్న దానిని కల్లు అంటే న్యాయమా? ప్రజలే ఆలోచించాలి మరి.