దేనికయినా రెడీ: మన్మోహన్ సింగ్
posted on Oct 24, 2013 @ 10:20PM
ఇంతవరకు పనిచేసిన ప్రధాన మంత్రులలో అందరి కంటే ఎక్కువ దేశాలు చుట్టబెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ‘ఫ్లయింగ్ సిఖ్’ బిరుదు స్వంతం చేసుకొన్నడా. మన్మోహన్ సింగ్ తాజాగా రష్యా, చైనా దేశాలు చుట్టబెట్టి వచ్చారు. ఇంతవరకు అంతా బాగానే సాగిపోతున్నా, రికార్డు నెలకొల్పే తొందరలో ఇటీవల అయన బొత్తిగా వారం వర్జ్యం కూడా చూసుకోకుండా విమానం ఎక్కేస్తుండటంతో ఆయన ప్రయాణంలో ఊహించని చికాకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి పాపం.
మొన్న ఆయన అమెరికాలో అధ్యక్షుడు ఒబామాతో కలిసి చాయ్ పానీలు సేవిస్తూ, మీడియాకి ఫోజులిస్తున్నపుడు, సరిగ్గా అప్పుడే ఇండియా నుండి ఫోన్ వచ్చింది. అవతలివైపు నుండి రాహుల్ బాబు ‘వాటీస్ దిస్ నాన్సెన్స్, త్రో ఇట్ ఇంటూ డస్ట్ బిన్’ అంటూ ఏవో బిగ్గరగా అరుపులు వినబడేసరికి కంగారు పడిపోయిన మన మోహనుడు, తన చేయి ఇంకా ఒబామా చేతిలోనే ఉన్నసంగతి కూడా మరిచిపోయి, “సారీ బేటా.. సారీ బేటా..నేను ఇంటికి రాగానే ఆ అర్డినెన్సుని చింపి పారేస్తాను కదా..” సర్ది చెప్పుకోవలసి వచ్చింది.
అందుకు ఒబామా చాలా నొచ్చుకొన్నాడు. గానీ మన మోహనుడు మాత్రం అస్సలు నొచ్చుకోలేదు. పైగా “కావాలంటే రాహుల్ బాబుని నా కుర్చీలో కూర్చోబెట్టి నేనే అతని క్రింద పనిచేస్తానని” మీడియా వాళ్ళకు ప్రామిస్ కూడా చేసారు.ఇంటికి వచ్చీరాగానే మొట్ట మొదట ఆయన చేసిన పని ఏమిటంటే, రాహుల్ బాబుకి కోపం తెప్పించిన ఆ ఆర్డినెన్స్ ను ముక్కలుముక్కలుగా చింపి బాబు చెప్పినట్లే చెత్త బుట్టలో వేసేసారు.
కానీ మళ్ళీ వారం వర్జ్యం చూసుకోకుండా చైనా, రష్యాలు తిరిగొద్దామని విమానం ఎక్కినందుకు, మన్మోహన్ సారుకి ఈ సారి కూడా చిక్కులు తప్పలేదు. ఆయన అటు విమానం ఎక్కడం చూసి ఇటు సీబీఐ వాళ్ళు బొగ్గు కుంభకోణం ఫైల్స్ అన్నీ తీసుకువెళ్ళి సుప్రీంకోర్టు చేతిలో పెట్టి చక్కావచ్చారు. ఈసారి ఏకంగా ఆయన పేరు (నేరుగా ఆయన పేరు చెప్పకుండా ‘సదరు అధికారి’ అని చార్జ్ షీట్లో పేర్కొన్నారు) కూడా చేర్చేయడంతో ఆయన విమానంలో ఎటూ పారిపోయే వీలులేక పోవడంతో మళ్ళీ మీడియా వాళ్ళకు దొరికిపోయారు.
వాళ్ళడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “బొగ్గు కుంభకోణంలో నాకు మసి అంటలేదు గనుక నేను ఏ పాపం ఎరుగను. కానీ నా వీపు మీద మసి అంటినట్లు సీబీఐ చెబితే నేనేమి చేయలేను. ఎందుకంటే ఆ మసి నేను చూసుకోలేను కదా! అందుకే ఒకవేళ సీబీఐ గనుక నన్ను బొగ్గుమీద ఏమయినా ప్రశ్నలు అడగదలచుకొంటే నేను సమాధానం చెప్పడానికి సిద్దం."
"ఆ బొగ్గు మసి నాచేతికి కూడా అంటుకోకుండా చాలా జాగ్రత్తగా ఆ ఫైళ్ళ మీద సంతకాలు చేసాను. గనుక ఎవరికయినా అనుమానాలు రావడం సహజమే. నేను చట్టానికి అతీతుడనేమి కాను. అందువల్ల నేను దేనికయినా రెడీ! అని తెగేసి చెప్పేసారు మన మన్మోహన్ సారు.