దూకుడేది.. బీజేపీ, బీఆర్ఎస్ లు లాలూచీ పడ్డాయా?
posted on Jan 4, 2023 @ 10:36AM
తెలంగాణలో ఇటీవలి కాలంలో తీవ్ర సంచలనం సృష్టించిన రెండు కేసుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. రాజకీయ లెక్కలు సరి చేసుకునేందుకు తమ అధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలను తమ ఇష్టం వచ్చనట్లు వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ రెండు కేసుల విషయంలో పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. మద్యం కుంభకోణం కేసు లో కవిత అరెస్టే తరువాయి అన్నట్లుగా హడావుడి జరిగింది. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులోనూ కేసీఆర్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేసి నంత బిల్డప్ ఇచ్చారు. కేంద్రానికేనా మాకు లేవా దర్యాప్తు సంస్థలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సిట్ కు అప్పగించారు.
ఈ రెండు కేసులలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ కేసులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు తమ తమ ప్రభుత్వాల జేబు సంస్థలు అన్నట్లుగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టే తరువాయి అంటూ బీజేపీ, ఎమ్మెల్యేల కుంభకోణం కేసులు బీఎల్ సంతోష్ నిండా ఇరుక్కున్నారు, ఆయన సిట్ దర్యాప్తునకు ఇహనో ఇప్పుడో రాక తప్పదంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. అయితే.. ఈ హంగామా, హడావుడీ అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నిందితులకు బెయిల్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలుబేరసారాల కేసు సిట్ నుంచి సీబీఐకి చేరింది.అయితే ఇంకా సీబీఐ కేసు తీసుకోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత లాంటి వారి ప్రమేయం బట్టబయలైందరనీ, వారి అరెస్టులు అనివార్యమన్నంత బిల్డప్ ఇచ్చిన ఈడీ , సీబీఐ ఇప్పటి వరకూ వారిపై కనీసం ఎఫ్ఐఆర్. చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు.
ఇక ఎమ్మెల్యేల ఎర కేసులు సిట్ దర్యాప్తు కుదరదంటూ సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించ లేదు.అయితే అదీ జరగలేదు. ఈ రెండు కేసులలోనూ కూడా దర్యాప్తు సంస్థల దూకుడు హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఈ రెండు కేసుల కథ కంచికి వెళ్లినట్లేనని కూడా అంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన రెండు కీలక కేసుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మౌనం ఆ రెండు పార్టీల మధ్యా లాలూచీకి నిదర్శనం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.