వెంకటగిరి ఇన్ చార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.. ఆనంకు జగన్ షాక్
posted on Jan 4, 2023 6:03AM
వైసీపీ సీనియర్ నాయకుడు, వెంటకగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆయనను తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. గత కొంత కాలంగా జగన్ తీరుపై, ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డిని ఆయన సొంత నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం ద్వారా ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు అయ్యింది. క్రమశిక్షణ చర్య పేరుతో నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తొలగించి రామ్ కుమార్ రెడ్డిని జగన్ తొలగించారు.
ఆనం రామనారాయణ రెడ్డి గత కొద్ది కాలంగా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడంలేదని మండిపడ్డారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. అలాగే ఏం పనులు చేశామని ప్రజలకు వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి ? అని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేనో కాదో అనే అనుమానం వస్తోందన్నారు. వెంకటగిరి అభ్యర్థిగా కొత్తవారిని ఎవరినైనా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల ప్రాతిపదికన వెంకటగిరి ప్రజలు తనకు ఓటేస్తే గెలిచానని, మరో సంవత్సరం పాటు తానే ఎమ్మెల్యేనని, కానీ ఓ పెద్దమనిషి అప్పుడే తాను ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అలాగే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా షాకిచ్చిన జగన్ ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు ఇంఛార్జ్‌గా నియమించారు. ఆ విధంగా కరణం బలరాం, ఆమంచిల మధ్య పంచాయతీకి చెక్ పెట్టారు