వీడిన ఉత్కంఠ.. మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు కొలిక్కి!
posted on Oct 23, 2025 @ 5:10PM
బీహార్ రాజకీయాలలో కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. మహాఘట్ బంధన్ లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. దీంతో మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పట్నాలోని మౌర్య హోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాఘట్ బంధన్ కూటమి నేతలు తేజస్వియాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సహానీ పేరు ప్రకటించారు.
కాగా కాంగ్రెస్ నుంచి పరిశీలకుడిగా వచ్చిన గెహ్లాట్ తేజస్వి యాదవ్ పేరును కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా యువనేత తేజస్వియాదవ్ పై పొగడ్తల వర్షం కురింపిచారు. తేజస్వికి సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉందన్న గెహ్లాట్, ఆయన నాయకత్వంలోనే మహాకూటమి పోటీ చేస్తున్నదని స్పష్టం చేశారు.
ఇక పోతే సీట్ల పంపకాల విషయంలో కూడా మహాఘట్ బంధన్ లో తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కూటమిలోని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో పీటముడి పడింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 19 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ఈ సారి 70 స్థానాల కోసం పట్టుబట్టింది.
అయితే అన్ని సీట్లను ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అనడంతో విభేదాలు మొదలయ్యాయి. అయితే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి సమస్య పరిష్కరించి, ప్రతిష్ఠంభనకు తెరదించే బాధ్యతను సీనియర్ నాయకుడు గెహ్లాట్ కు అప్పగించింది. దీంతో బుధవారం (అక్టోబర్ 22) పట్నా చేరుకున్న గెహ్లాట్.. ఆర్జీడీ ముఖ్య నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వియాదవ్ తో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించడంతో ప్రతిష్ఠంభనకు తెరపడింది. దీంతో ఇక కూటమి ఐక్యంగా ప్రచార పర్వంలోకి దిగుతుందని అంటున్నారు.