వైసీపీకి సీన్ రివర్స్!
posted on May 27, 2024 @ 11:08AM
జగన్ కు ఏ విషయమైనా సరే రివర్స్ లో జరిగితేనే ఇష్టం. ఆయన 2019లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రివర్స్ లోనే పాలన సాగించారు. అంత వరకూ అభివృద్ధిలో అగ్రస్థానం వైపు దూసుకు వెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆపోజిట్ గా పరుగులు పెట్టించారు. వేగంగా నిర్మాణం అవుతున్న అమరావతిని నిర్వీర్యం చేసేశారు. ఠాఠ్ అమరావతి ఒక్కటే రాజధాని ఏమిటి? ఏపీకి మూడు రాజధానులు కావాలి అంటూ కొత్త నినాదం తీసుకుని పాలనను రివర్స్ గేర్ లో నడిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం పురోగతిని స్తంభింప చేసేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ తిరోగమనానికి శ్రీకారం చుట్టారు.
ఐదేళ్ల పాలన తరువాత ఆయనకు ఇప్పుడు 2019 ఫలితం రివర్స్ లో రావడం ఖాయమైపోయిందని పరిశీలకులే కాదు, ప్రజలూ ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ రివర్స్ ఫలితం ఆయన కోరుకున్నదేనంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. ఔను మే 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ట్రెండ్ చూసిన తరువాత వైసీపీయే ఈ సారి తమకు 2019నాటి ఎన్నికలకు పూర్తి రివర్స్ గా రానున్నాయని అంగీకరించేస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు వైసీపీ మాటలు కూడా 2019 ఫలితాల సమయంలో మాట్లాడిన మాటలకు పూర్తి రివర్స్ గా ఉన్నాయి. అదే ఇంకా అర్ధం కాని వారెవరైనా ఉంటే వారికి కూడా ఫలితం అర్ధమయ్యేలా చేస్తున్నది.
అప్పట్లో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ పాత్ర అధికార పార్టీగా ఉన్న వైసీపీ పోషిస్తోంది. ఎన్నికలకు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం తనకు ఏ కోశానా లేదని పోలింగ్ కు ముందు వైసీపీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. పోలింగ్ ముగిసిన క్షణం నుంచీ వైసీపీ నేతలు అదే పాట పాడుతున్నారు.