మార్పు కనిపించేస్తోందిగా? వైసీపీకి సీన్ అర్ధం అయిపోయిందా?
posted on May 27, 2024 @ 10:42AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారుతోందన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఇంత కాలం వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు ఇప్పుడు తటస్థంగా ఉంటున్నారు. అంతే కాదు ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులపై వేటు వేసింది. అలా వేటు పడిన స్థానంలో వచ్చిన వారు.. మరింత మందిని కీలక విధులకు దూరం చేశారు. మరింత మందిపై నిఘా పెట్టారు. ఈ మార్పు ఒక్క సారిగా పోలీసు వ్యవస్థలో కింది నుంచి పై దాకా ఉలిక్కిపడేలా చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో, ఒక పార్టీతో అంటకాగితే జరిగే పరిణామాలేమిటో తేటతెల్లం చేసింది. దీంతో ఏపీ పోలీసుల తీరు ఒక్కసారిగా మారిపోయింది. గత ఐదేళ్లూ ఒక తీరు.. గత కొద్ది రోజులుగా మారో తీరుగా మారిపోయింది.
వైసీపీ హయాంలో అంటే గత ఐదేళ్లుగా పోలీసు అధికారులకు పదోన్నతులు, కీలక పోస్టింగులకు వారిపై ఉన్న అభియోగాలూ, అధికార పార్టీకి అనుకూలంగా పని చేయడానికి సై అనడమే అర్హతలుగా మారాయి. ఇప్పుడు అలా కీలక పోస్టింగులలో వచ్చి తిష్ట వేసిన వారికి ఇప్పుడు స్థాన చలనం కలిగింది. ఇక మిగిలిన వారిలో భయం మొదలైంది. దీంతో మొత్తం పరిస్థితి వైసీపీకి రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని చెప్పడానికి వైసీపీ పెద్దల మాటలను కింది స్థాయి పోలీసులే ఖాతరు చేయకపోవడాన్ని ఉదాహరణగా పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ బాధితులపైనే కేసుల నమోదుకు పరిమితమైన పోలీసులు ఇప్పుడు వైసీపీ కేడర్, నాయకులపై కూడా యాక్షన్ తీసుకోవడానికి, కేసులు నమోదు చేయడానికి వెనుకాడటం లేదు. రాష్ట్రంలో మారిన ఈ పరిస్థితే జూన్ 4న ఫలితం ఎలా ఉండబోతోందో చెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రజల నాడి ఎలా ఉందో, ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో అందరి కంటే నిక్కచ్చిగా, కచ్చితంగా అంచనా వేయగలిగేది క్షేత్ర స్థాయిలో పోలింగ్ విధులు నిర్వహించిన పోలీసులే అని అంటున్నారు.