నా ఘోష ఎవరికీ పట్టదా?

నా ఘోష ఎవరికీ పట్టదా?

Publish Date:Aug 13, 2025

కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నారు చలం. ఆయనే ఇప్పుడు బతికి ఉంటే కృష్ణశాస్త్రి బాధ కాదు, జగన్ బాధ ప్రపంచానికి బాధ అని అని  ఉండేవారు. ప్రపంచం అంతా తనకు మద్దతుగా నిలవాలనీ, అందరూ తనకు సానుభూతి చూపాలనీ, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల వల్లే జనం మద్దతు దండిగా ఉన్నా గత ఏడాది ఎన్నికలలో తనకు ఘోర పరాజయం ఎదురైందనీ జగన్ బాధపడటమే కాదు... అందరూ, అన్ని పార్టీల వారూ కూడా తనకు మద్దతుగా ఆ బాధపడాలని గట్టిగా కోరుకుంటారు. అలా తనకు మద్దతుగా నిలవని వారంతా చంద్రబాబుకు దగ్గర అనీ, ఆయనతో కుమ్మక్కు అయ్యారనీ గట్టిగా నమ్మడమే కాకుండా ప్రపంచం కూడా నమ్మాలని కోరుకుంటారు జగన్.  తన అడ్డా అనుకున్న పులివెందులలో వైసీపీ చతికిల పడటం, తన ఖిల్లా అనుకున్న పులివెందుల బీటలు వారడంతో ఆయన ఇక తనకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవన్న నిర్వేదంలో పడిపోయారు  జగన్.  ఇప్పుడు ఆయన  ప్రపంచం అంతా తనపై పగబట్టిందన్న భ్రమల్లో మునిగిపోయారు. దీంతో కోడిగుడ్డుకు, బోడిగుండుకు ముడిపెడుతున్న చందంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ బుధవారం (ఆగస్టు 13) మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ తనకూ, తన పార్టీకీ అన్యాయం జరుగుతున్నా ఎవరూ వచ్చి  ఖండించడం లేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఎవరూ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని, పులివెందులలో తన పార్టీ పట్టు కోల్పోవడాన్ని ఎందుకు ఖండించడం లేదని నిలదీస్తున్నారు. ఇంత కాలం తాను దత్తపుత్రుడిగా సహకారం అందించిన ప్రధాని మోడీసైతం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతే కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు తన పరిస్థితికి కానీ, వైసీపీ పతనానికి కానీ కారణం తానేనన్న విషయాన్ని ఇసుమంతైనా గుర్తించడానికి నిరాకరిస్తూ.. తనకు మద్దతుగా నిలవని వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. అయితే పిల్లి శాపనార్ధాలకు ఉట్టితాళ్లు తెగిపడవన్న సమెతను గుర్తుకు తెచ్చేలా మాట్లాడుతున్నానని గ్రహించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో మాట్లాడుకుంటూ.. తన పతనానికి కుట్రలు చేస్తున్నారని పులివెందుల ఎమ్మెల్యే యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన సొంత చెల్లి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిత్యం జగన్ పై చేస్తున్న విమర్శలకు జగన్ ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.   అయినా జగన్ కు ఎవరైనా ఎందుకు మద్దతుగా నిలుస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ గత ఏడాది ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అయితే అదే  బీజేపీయేతర పార్టీలు మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు జగన్ ఇసుమంతైనా మద్దతు ఇవ్వలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  అంతే కాదు.. ఇప్పుడు పులివెందులలో రిగ్గింగు, పోలింగ్ బూత్ ల మార్పు అంటూ గగ్గోలు పెడుతున్న జగన్.. రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా హస్తినలో చేపట్టిన ఆందోళనలో పాల్గొనడం అటుంచి కనీసం మద్దతు కూడా ప్రకటించలేదన్న విషయం ఎలా మరచిపోయారు?
నష్టనివారణా.. జగన్ అరెస్టు ఖాయమన్న సంకేతమా?

నష్టనివారణా.. జగన్ అరెస్టు ఖాయమన్న సంకేతమా?

Publish Date:Jul 26, 2025

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది. దాని కంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వరుసగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ భయాన్ని ఎత్తి చూపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీ అంత వరకూ ప్రదర్శిస్తూ వస్తున్న గాంభీర్యం లేదా మేకపోతు గాంభీరం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. పొంతన లేని ప్రకటనలతో పార్టీలో నెలకొన్న అయోమయాన్ని బహిర్గతం చేసుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో సజ్జల బయటకు వచ్చి వైసీపీ అనుకూల మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూల సారాంశం ఏమిటన్న దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత నష్టనివారణ, క్యాడర్ లో ధైర్యాన్నినింపడం ఎజెండాగా సజ్జల మాట్లాడిన మాటలు క్యాడర్ లో ధైర్యం నింపడం సంగతి అటుంచి క్యాడర్ ను మరింత గందరగొళంలోకి నెట్టేశాయి. మొత్తంగా సజ్జల మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న సంకేతం ఇచ్చారు. జగన్ అరెస్టు కు క్యాడర్ ను సంసిద్ధం చేయడమే ఆయన ఇంటర్వూల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ప్రభుత్వ హయాంలో సజ్జల సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన నాడు అన్ని శాఖలపైనా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ ఏడాది కాలంలో ఆయనకు పనేమీ లేకుండా పోయింది. అయితే మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ అరెస్టును, ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీని సమర్ధించుకోవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఆ పనిని ఆయన చేయగలిగినంత అస్తవ్యస్తం చేస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకే కంగారుపడితే ఎలా? ముందు ముందు జగన్ కూడా ఈ కేసులో కటకటాల వెనక్కు వెడతారు.. అంటే ఆయన పార్టీ క్యాడర్ కు సంకేతాలిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి తొలి ఏడాది ఎవరినైనా అరెస్టు చేయడం సులువే.. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అదే జగన్ అన్ని ఆధారాలూ సేకరించిన తరువాత తన అధికారం చివరి దశలో చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. అయితే ఇక్కడ సజ్జల ఉద్దేశపూర్వకంగా విస్మరించిన సంగతేంటంటే.. జగన్ ప్రభుత్వం అన్ని ఆధారాలూ సేకరించి చంద్రబాబునున అరెస్టు చేసినట్లైతే.. ఆ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంలో విఫలం ఎందుకైంది? అన్న ప్రశ్నకు సమాధానం. మొత్తంగా నష్టనివారణ అంటూ మీడియా ముందుకు అదీ జగన్ అనుకూల మీడియా ముందుకు వచ్చి సజ్జల చెప్పిందేమిటంటే.. జగన్ మద్యం కేసులో అరెస్టు కాబోతున్నారు అనే.  

కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్‌ఫ్యూజన్

Publish Date:Jul 25, 2025

వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీ పార్టీలో నెలకొన్న వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు,  అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట.  తాజాగా కవిత జాగృతి వర్సెస్ పార్టీ అనుభంద సంస్థ బీఆర్ఎస్వీ పోటాపోటీగా ఓకే రోజూ శిక్షణ తరగతులు, వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. ఒకే రోజు జాగృతి ఒకవైపు.. బీఆర్ఎస్వీ మరోవైపు కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ఆధిపత్య పోరు అన్నాచెల్లెళ్ల సవాల్ అన్నట్లుగా మారిందనే చర్చ నేతల్లో నడుస్తోంది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉంది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కేడర్ లో మాత్రం గందరగోళానికి తెరదీసిందట. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత ఇద్దరూ కీలక నేతలు. ఇద్దరూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసులే. పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నప్పటికీ సొంత జాగృతి సంస్థ బలోపేతంపైనే ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జాగృతి ఆధ్యర్యంలోనే కార్యక్రమాలు చేపడుతూ యాక్టివ్ అవుతున్నారు. కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  అయితే ఒకే రోజు ఇటు జాగృతి శిక్షణ తరగతులు, అటు బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేదికలు వేర్వేరు ప్రాంతాలు అయినప్పటికీ ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు కల్వకుంట్ల వారసులు  ప్రకటించారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే లీడర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్వీ సదస్సుకు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలు హాజరై రెండు సెషన్లలో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో ఆయోమయానికి, గందరగోళానికి కారణమైందట.  ఎందుకు ఒకేసారి అన్నచెల్లెలు ఒకే సారి వేర్వేరుగా ప్రోగ్రాంలను ఫిక్స్ చేశారు?  అసలు కారణం ఏంటి?  ఒకరు ఒక తేదీలో.. మరొకరు ఇంకో తేదీలో శిక్షణ తరగతులు నిర్వహించవచ్చుకదా? అన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. ఆ క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది తెలియక కేడర్ లో అయోమయం నెలకొందట. కవిత యువత, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో జాగ‌ృతిని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. యువత, మహిళలు, బహుజనులు రాజకీయాల్లో రావాలని ప్రతీ సందర్భంలోనూ పిలుపునిస్తున్నారు.  అందులో భాగంగానే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలుత రాష్ట్రస్థాయిలో ‘లీడర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం (జులై26)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ  కార్యక్రమం నిర్వహించనున్నట్లు  ఆమె గత నెల 15నే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జాగృతి ప్రతినిధులు రావాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్ ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యులందరికీ కేసుల చట్రం బిగుసుకుంటుండటంతో... చిన్నబాస్‌కు పార్టీ నేతల సహకారం  పూర్తి స్థాయిలో లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా తనదైన వ్యూహాలు అమలు చేస్తున్న కేటీఆర్  బనకచర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీఆర్ఎస్వీకి అప్పగిస్తూ తాజా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అందుకు తగ్గట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యచరణ సిద్ధంచేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై జంగ్ సైరన్ మోగించేందుకే ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం ఉదయం సెషన్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తుండగా... సాయంత్రం సెషన్ లో కేటీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని చూస్తున్నారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఎవరికి వారే పార్టీ తమకు ప్రాణం అంటూనే .. ఎవరికి వారు సొంతంగా యాక్షన్‌ప్లాన్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోకపోయినా.. ఎవరికి వారు సొంత కార్యచరణ మేరకు ముందుకు సాగడం చూస్తుంటే.. వారిరువురి తీరు   గులాబీ పార్టీని మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయన్న అభిప్రాయం పార్టీ లీడర్లు, క్యాడర్ లో వ్యక్తమౌతోంది.

పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఇలా మాన్పించేయవచ్చు..!

Publish Date:Aug 13, 2025

  నేటి డిజిటల్ యుగంలో పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఆటలు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఇవన్నీ పిల్లలను ఎంతగా ఆకర్షిస్తాయంటే వారు బయటి ప్రపంచం నుండి దూరమైపోతారు. ఇది వారి చదువులను ప్రభావితం చేయడమే కాకుండా  కళ్ళకు కూడా చాలా ప్రమాదం. మరీ ముఖ్యంగా ఇలా ఫోన్ కు బానిస అయిపోవడం అనేది పిల్లల సామాజిక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జరుగుతున్న నష్టాలేంటి? ఫోన్ నుండి పిల్లలను దూరం ఉంచడం ఎలా? తెలుసుకుంటే.. నష్టాలు.. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడానికి ఇష్టపడరు. బదులుగా వారు ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడుపుతారు. ఈ రోజుల్లో ఒక సంవత్సరం పిల్లవాడు కూడా మొబైల్‌లో వీడియోలు చూపిస్తేనే  ఆహారం తింటాడు, లేకుంటే ఏడుస్తూనే ఉంటాడు. మరోవైపు, 14 ఏళ్ల టీనేజర్ బాలుడు కూడా పాఠశాల నుండి వచ్చిన తర్వాత మొబైల్‌తో బిజీగా ఉంటాడు. ఫోన్ లో గేమ్స్.. ఆటలు,  యూట్యూబ్‌లో గంటల తరబడి గడుపుతాడు.  మొబైల్ ఫోన్ వాడటం వల్ల వారి సామాజిక, శారీరక,  మానసిక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అయినా..  కొన్ని చిన్న మార్పులు,  స్మార్ట్ ట్రిక్స్‌తో పిల్లలు మొబైల్‌కు బానిసల్లా మారడాన్ని  చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం కింది టిప్స్ పాటించవచ్చు. స్క్రీన్ టైమ్ ఫిక్స్ చేయాలి.. మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి, పిల్లల స్క్రీన్ టైమ్ కోసం ఒక నియమాన్ని రూపొందించాలి.  ప్రతిరోజూ మొబైల్ వాడకానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయాలి. తద్వారా పిల్లవాడు రోజంతా మొబైల్ వాడకుండా ఆ సమయానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తాడు. ఇది క్రమంగా  మొబైల్ వ్యసనం నుండి బయటపడేలా చేస్తుంది. యాక్టివిటీస్.. పెయింటింగ్, కథలు, బయటకు వెళ్లి ఆడుకోవడం, ఆర్ట్స్,క్రాప్ట్స్ ద్వారా పిల్లల దృష్టిని మొబైల్ ఫోన్ల నుండి మళ్లించవచ్చు. వారి మొబైల్ వినియోగాన్ని తగ్గించడానికి వారిని ఇంటరాక్టివ్ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. కుటుంబం.. పిల్లలలో ఉన్న మొబైల్ వ్యసనాన్ని మాన్పించడానికి పిల్లలతో ఆడుకోవాలి. వారితో మాట్లాడాలి, మొబైల్ కంటే కుటుంబంతో ఎక్కువ ఆనందం ఉందని వారికి అనిపించేలా చేయాలి. ఒక పిల్లవాడు బోర్ కొట్టినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు, అతను మొబైల్ వాడటం ఒక వ్యసనంగా మారుతుంది. కానీ అతను తన పరిసరాలతో లేదా కుటుంబంతో ఆనందించడం ప్రారంభించినప్పుడు మొబైల్‌ను మరచిపోయి కుటుంబంతో సమయం గడుపుతాడు.  ఎంపిక.. పిల్లలు వినోదం కోసం లేదా సమయం గడపడానికి మొబైల్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణాన్ని అర్థం చేసుకుని వారికి మొబైల్‌కు ఇతర ప్రత్యామ్నాయాలను అందించాలి. ఉదాహరణకు.. పజిల్స్, బోర్డ్ గేమ్‌లు, పుస్తకాలు,  పిల్లల కోసం సంగీతం వంటి ఎంపికలను ఉండేలా చూడాలి. ఇది పిల్లలలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది,  మొబైల్ వ్యసనాన్ని తగ్గిస్తుంది. రోల్ మోడల్స్.. పిల్లలు తాము చూసేది నేర్చుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు  రోజంతా మొబైల్‌లో గడుపుతూ ఉంటే  పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి  మొబైల్ వాడకాన్ని  పరిమితం చేసుకోవాలి. తల్లిదండ్రుల దినచర్య, తల్లిదండ్రులు చేసే పనుల దృష్ట్యా పిల్లలు కూడా చక్కని దినచర్య అలవర్చుకుంటారు.  పిల్లలకు తల్లిదండ్రులే మంచి రోల్ మోడల్స్ కావాలి.                                       *రూపశ్రీ.
[

Health

]

నో ఆయిల్ డైట్.. 30 రోజులు దీన్ని ఫాలో అయితే మ్యాజిక్కే..!

Publish Date:Aug 13, 2025

  భారతీయులు  ఆహార ప్రియులు. భారతదేశంలో ఉండే అన్ని వంటకాలు, అన్ని పదార్థాలు మరెక్కడా లభించవని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఆహారం నూనె వినియోగం తోనే జరుగుతుంది. నూనె లేకుండా చాలా వంటకాలను అస్సలు తయారు చేయలేరు కూడా.  నూనె భారతీయ  వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి విషంగా మారుతుంది. ఆహారంలో ఎక్కువ నూనెను ఉపయోగిస్తే అది ఊబకాయం, గుండె జబ్బులు,  అనేక ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో ఉండే అధిక కేలరీలు శరీరానికి  అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. అందుకే ఇప్పుడు  నూనె లేని ఆహారం అనే ట్రెండ్‌ని  చాలామంది అనుసరిస్తున్నారు. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  అసలు నో ఆయిల్ డైట్ అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. నూనె లేని ఆహారం అంటే.. నో ఆయిల్ డైట్‌లో ఆహారంలో  నూనె పూర్తిగా తొలగించబడుతుంది. బదులుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్,  విత్తనాలు వంటి తృణధాన్యాలు  సహజమైనవిగా  తింటారు. వీటిలో ఇప్పటికే కొంత సహజ కొవ్వు ఉంటుంది. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నూనె లేని ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారం నుండి నూనెను పూర్తిగా తొలగించినప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది. ఉడికించిన పప్పులు, కాల్చిన కూరగాయలు,  నూనె లేకుండా చేసిన వాటిని ఆహారంలో చేర్చడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. శుద్ధి చేసిన నూనెలో ఒమేగా-6 కొవ్వులు అధికంగా ఉంటాయి.  దీన్ని  ఆహారం నుండి తొలగిస్తే, శరీరంలో మంట తగ్గుతుంది,  కొలెస్ట్రాల్,  రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నూనె లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది కడుపు, కాలేయం,  క్లోమంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఆహారంలో నూనె వాడకపోవడం ద్వారా ముఖంపై మొటిమలు,  మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు శరీరం కూడా డీటాక్స్ అవుతుంది. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. నూనె పదార్థాలు తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.  ఇది తరచుగా ఆకలి, మానసిక స్థితిలో మార్పులు,  అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...