జాతీయ గ్రంథాలయ దినోత్సవం... సరస్వతి నిలయానికి జయహో!
posted on Aug 12, 2025 @ 4:16PM
ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశంలో గ్రంథాలయ దినోత్సవం (National Librarians’ Day)ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును "భారత పబ్లిక్ లైబ్రరీ ఉద్యమ పితామహుడు"గా పేరుపొందిన డా. ఎస్.ఆర్. రంగనాథన్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటారు. అసలు రంగనాథన్ గారు ఎవరు? అయన జయంతినీ లైబ్రరీ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? అయన గ్రంథాలయాల గురించి చేసిన కృషి ఏమిటి? తెలుసుకుంటే..
డా. ఎస్.ఆర్. రంగనాథన్ ఎవరు?
రంగనాథన్ గారి పూర్తిపేరు శియాలి రామం రంగా నాథన్ ఈయన ఆగస్టు 12, 1892, తమిళనాడులో జన్మించారు. ఈయన గణిత శాస్త్రవేత్త, పుస్తక శాస్త్రవేత్త, భారత పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు. "Library Science"లో ఆధునిక సూత్రాలను ప్రతిపాదించి, భారతదేశంలో పుస్తకాలను, గ్రంథాలయాలను సమాజానికి చేరువ చేశాడు. ఆయన రూపొందించిన ‘పంచ సూత్రాలు’ ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా లైబ్రరీ రంగానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి.
పంచ సూత్రాలు..
రంగనాథన్ గారు రూపొందించిన పంచ సూత్రాలు ఇవే..
1 . Books are for use – పుస్తకాలు వినియోగం కోసం.
2 .Every reader his/her book – ప్రతి పాఠకుడికి తన పుస్తకం.
3. Every book its reader – ప్రతి పుస్తకానికి తన పాఠకుడు.
4. Save the time of the reader – పాఠకుడి సమయాన్ని ఆదా చేయాలి.
5. The library is a growing organism – గ్రంథాలయం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే జీవంతమైన వ్యవస్థ.
ఎందుకు జరుపుకుంటారు?
డా. రంగనాథన్ గారు గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయన కృషిని స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
పుస్తకాల ప్రాముఖ్యతను, లైబ్రరీల అవసరాన్ని ప్రజల్లో మళ్లీ గుర్తు చేయడం కూడా ఈ రోజు ముఖ్య ఉద్దేశమే.
డిజిటల్ యుగంలో కూడా గ్రంథాలయాల విలువను ప్రోత్సహించడం. దాన్ని గుర్తించడం కోసం ఈరోజు ఎంతో సహాయపడుతుంది.
పాఠకులు, విద్యార్థులు, పరిశోధకులు లైబ్రరీలను ఎక్కువగా వినియోగించేలా ప్రేరేపించడం వల్ల లైబ్రరీలు ఆదరణ పెరుగుతోంది, పుస్తక పఠనం మెరుగవుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా జ్ఞానార్జన పెరుగుతుంది.
ఈ రోజున జరిగే కార్యక్రమాలు
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. ఇది పుస్తకాల నిలయమైన లైబ్రరీల ఆదరణకు పునాది అవుతుంది.
గ్రంథాలయాల పర్యటనలు చేయడం కూడా ఇందులో భాగంగా. దేశంలో ఎన్నో గొప్ప గ్రంధాలయాలు ఉన్నాయి. లక్షలాది పుస్తకాలను తమలో నిక్షిప్తం చేసుకుని జ్ఞాన బాండాగారాలుగా నిలుస్తున్నాయి.
పఠన పోటీలు, సాహిత్య చర్చలు చేయడం ద్వారా పుస్తకాలను, వాటిని భద్రపరిచే గ్రంథాలయాల అవశ్యకతను కూడా తెలుసుకోవచ్చు
పుస్తక దానం కార్యక్రమాలు చేయడం వల్ల పుస్తక సంపద పెరుగుతుంది. కొన్ని ప్రైవేట్ గ్రంధాలయాలు కు పుస్తకాలను విరాళాలు గా ఇవ్వడం వల్ల వాటిని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం.
లైబ్రేరియన్లను ఈ సందర్భంగా సన్మానించవచ్చు. లైబ్రరీకి వచ్చిన ప్రతి వ్యక్తికి అవసరమైన పుస్తకాలను ఇస్తూ లైబ్రరీని నడిపే వారి కృషి గుర్తించాలి.
గ్రంథాలయాల ప్రాముఖ్యత
గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల గది కాదు
అది ఒక జ్ఞానాలయం. పాఠకుడికి చదవడానికి వేదిక అవుతుంది. పరిశోధనలుంచేసేవారికి మంచి సమాచారం అందిస్తుంది. విద్యార్తులలో ప్రేరణను నింపేవి గ్రంధాలయాలు. ఎంపిక చేసుకుని చదివితే గొప్ప పుస్తకాలు అక్కడ విద్యార్థులను గొప్ప వాళ్ళుగా మారుస్తాయి. సమాజానికి అభివృద్ధి మార్గం పుస్తక పఠనం వల్ల జరుగుతుంది.
"గ్రంథాలయం అనేది నిశ్శబ్దంలో జ్ఞాన విప్లవం జరిగే స్థలం" అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
*రూపశ్రీ.