రాఖీ పండుగ ఏడాది మొత్తం గుర్తుండిపోవాలంటే.. ఇలా సెలబ్రేట్ చేసుకోండి..!
posted on Aug 9, 2025 @ 3:34PM
రక్షా బంధన్ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు కోసం కొందరు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటారు. కొందరు అక్కాచెల్లెళ్ళు ఇప్పటికే కొత్త ఆలోచనలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. కొత్త బట్టలు, రాఖీ సిద్ధం చేసుకోవడం పరిపాటి. ప్రతిసారీ పండుగను ఇంకాస్త మెరుగ్గా చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఇంకా మెరుగ్గా అంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు. మెరుగ్గా చేసుకోవడం అంటే కాస్త ఖరీదైన రాఖీ కట్టడం, ఖరీదైన స్వీట్లు తెచ్చి పంచుకుని తినడం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది తప్పు.. చాలామంది చేసేది కూడా రాఖీ కట్టడం, స్వీట్లు తినడం.. దీంతో రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ రాఖీ పండుగ ఏడాది మొత్తం గుర్తుండిపోవాలి అంటే.. కాస్త డిఫరెంట్ గా ఆలోచించాలి. ప్రణాళిక మార్చాలి. ఇందుకోసం ఏమేమి చేయవచ్చు తెలుసుకుంటే..
సరదా రోజు..
రక్షా బంధన్ ను స్పెషల్ గా చేసుకోవాలనుకుంటే ఆ రోజును సరదాగా మార్చేయాలి. ఇందులో భాగంగా సినిమా చూడటానికి వెళ్ళవచ్చు. ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు, తోబుట్టువులందరితో కలిసి సినిమా వెళ్లడం చాలా మంచి అనుభూతి ఇస్తుంది. అందరూ కలసి ఇంట్లో అయినా ఒక మంచి సినిమా చూసేయవచ్చు. సినిమా చూస్తూ ఆస్వాదించడానికి అందరూ కలసి స్నాక్స్ రెఢీ చేసుకోవడం, లేదా ఆర్డర్ చేసుకుని అయినా సరే.. అందరూ కలిసి కాసింత సమయం గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది. అట్లాగే గేమ్స్ ఆడటం, సరదాగా గడపడం ద్వారా రోజును గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు.
ఫ్యామిలీ టూర్..
కుటుంబం మొత్తం ఒకే చోట కలవడం చాలా మంచి జ్ఞాపకం అవుతుంది. కుటుంబంతో కలిసి పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు. కుటుంబం అంతా ఒకే చోట కలిసేలా మీరు ఒక గొప్ప రోజును ప్లాన్ చేసుకున్నట్లుగా ఉంటుంది. అందమైన గార్డెన్ లో లేదా మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం స్నాక్స్, స్వీట్లు, పానీయాలు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా టూర్ ఎంజాయ్ చేయవచ్చు. అందరూ కలసి గేమ్స్ ఆడుకోవడం లాంటివి కూడా భలే మజా ఇస్తాయి.
కలిసి వంట చేయడం..
రక్షా బంధన్ రోజు అన్నా చెల్లెళ్లు కలిసి ఇష్టమైన ఆహారాన్ని వండటం, దాన్ని ఇంటిల్లిపాదికి వడ్డించడం చేయవచ్చు. ఇది చాలా మంచి మెమరీ గా మిగులుతుంది.
మంచిగా మాట్లాడాలి..
సాధారణంగా అన్నా చెల్లెళ్లు అంటే గొడవ పడటం, కొట్టుకోవడం, అల్లరి చేయడం.. ఇదే ఎక్కువ ఉంటుంది. కానీ రాఖీ పండుగ రోజు ఇద్దరూ ఆప్యాయంగా ఉండటం, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడటం, ఒకరికి మరొకరు ధైర్యం ఇచ్చుకోవడం వంటివి చేయాలి. ఇదే వారి జీవితాంతం కొనసాగితే వారి జీవితం ఎంత అదంగా, ఎంత ధైర్యవంతంగా ఉంటుందో అర్థమైతే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం పదికాలాల పాటు ఆనందమయంగా ఉంటుంది.
*రూపశ్రీ.