సంజయ్ దత్త్ పిటిషను విచారించనున్న సుప్రీం కోర్ట్
posted on Apr 16, 2013 @ 3:49PM
అక్రమాయుధాల కేసులో మూడున్నర సం.ల జైలు శిక్ష అనుభవించవలసిఉన్న బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ ఈ నెల 18వ తేదిలోగా కోర్టు ముందు లొంగిపోవలసి ఉంది.
అతను క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకొంటే పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకోగలదని మహారాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పిన తరువాత, చెలరేగిన రాజకీయ దుమారం చూసి నొచ్చుకొన్నసంజయ్ దత్త్ తానూ క్షమాభిక్ష కోరనని, అది అవసరమయిన వారు చాలా మందేఉన్నారని, తానూ స్వచ్చందంగా జైలు శిక్ష అనుభవించడానికే నిశ్చయించుకొన్నానని మీడియాతో అన్నారు. కానీ, తీవ్రమానసిక క్షోభ అనుభవిస్తున్న ఆయన, లొంగివలసిన సమయం దగ్గిర పడిన తరువాత, ఆయన ఆలోచనలలో కూడా కొంచెం మార్పు వచ్చినట్లుంది.
తను లొంగిపోవడానికి మరో ఆరునెలలు గడువు ఇప్పించవలసిందిగా కోరుతూ ఆయన నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషను వేశారు. క్షమాభిక్ష పెట్టవలసిందిగా కోరుతూ తానూ స్వయంగా మహారాష్ట్ర గవర్నర్ కు దరఖాస్తు చేసుకొనప్పటికీ, అయనకు క్షమాభిక్ష పెట్టవలసిందిగా కోరుతూ సినీనటి జయప్రద వంటివారు అనేక మంది లేఖలు వ్రాశారు. తన క్షమాభిక్ష అభ్యర్ధన ప్రస్తుతం గవర్నర్ పరిశీలనాలో ఉన్నందున కనీసం ఆయన తన నిర్ణయం ప్రకటించేవరకయినా తనకు సమయం ఇప్పించవలసిందిగా ప్రార్దిస్తూ సంజయ్ దత్త్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్నుపరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది. బహుశః రేపు ఆయన పిటిషన్ కోర్టు ముందుకు రావచ్చును.
కానీ, అదే కేసులో నిందితులయిన జబున్నిసా అన్వర్ ఖాజీ, ఇస్సాక్ మొహమ్మద్ హజ్వానే మరియు షర్రిఫ్ అబ్దుల్ గఫూర్ పార్కర్ అనే ముగ్గురు నిందితులు కూడా ఇదేవిధంగా కోరుతూ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజే తిరస్కరించింది. వారిలో జబున్నిసా అన్వర్ ఖాజీకి 5సం.ల జైలు శిక్ష ఖరారు చేయగా, మరో ఖైదీ ఇస్సాక్ మొహమ్మద్ హజ్వానేకు గతంలో టాడా కోర్టు విదించిన 5సం.ల జైలు శిక్షను సుప్రీం కోర్టు యావజీవిత ఖారాగార శిక్షగా మార్చింది. ఇప్పటికే 14సం.ల జైలు శిక్ష అనుభవించిన షర్రిఫ్ అబ్దుల్ గఫూర్ పార్కర్ అనే మరో ఖైదీకి టాడా కోర్టు విదించిన యావజీవిత ఖారాగార శిక్షనే సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసింది.
ఈ నేపద్యంలో సంజయ్ దత్త్ చేసుకొన్న దరఖాస్తును సుప్రీంకోర్టు పరిశీలించడానికి అంగీకరించినప్పటికీ ఆయనకు గడువు పెంచడానికి బహుశః అంగీకరించకపోవచ్చును. అప్పుడిక సంజయ్ దత్త్ ఈ నెల 18న జైలుకి తెరిగి వెళ్ళక తప్పకపోవచ్చును. అదేజరిగితే, అతని మీద దాదాపు రూ 250 కోట్ల పెట్టుబడితో తీయవలసిన సినిమాలన్నీ కూడా ఆగిపోవడం ఖాయం. తద్వారా ఆయా నిర్మాతలకి నష్టాలు తప్పవు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటిసారిగా హిందీలో నటిస్తున్న జంజీర్ సినిమాలో సంజయ్ దత్త్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా తెలుగులో తుఫాన్ గా విడుదల అవుతోంది. అదృష్టవశాత్తు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోవడమేకాకుండా, ఇటీవలే సంజయ్ దత్త్ తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పడంతో ఈ సినిమా పెద్ద సమస్య నుండి త్రుటిలో తప్పించుకోగలిగింది.