దోచెయ్.. దాచెయ్! ఇసుకలో క్విడ్ ప్రోకో..
posted on Mar 24, 2021 8:50AM
ఏపీలో ఇసుక దందా. ప్రకృతి ప్రసాదిత ఇసుకంతా ప్రైవేటు పరం. క్విడ్ ప్రోకో అంటోంది ప్రతిపక్షం. టెండర్లంటూ సర్కారు సమర్ధింపు. ఇందులో ఏది నిజం? ఏది ప్రచారం?. కాస్త లోతుగా పరిశీలిస్తే ఇసుక నుంచి కాసుల తైలం పిండుకునే విధానం బయటకు వస్తుంది అంటున్నారు విపక్ష నేతలు. జగన్ ఆస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తికే పరోక్షంగా ఇసుక రీచ్‌లు అప్పగించారని ఆరోపిస్తున్నారు. ఇసుక టెండర్ల వెనుక నడిచిన క్విడ్ ప్రోకో గురించి పూస గుచ్చినట్టు వివరిస్తున్నారు.
ఇసుకపై జగన్ సర్కార్ ముందు నుంచి డ్రామాలే చేసింది. మొదట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక ఉచిత సరఫరా అన్నారు. ఆ తర్వాత మాట మార్చారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే.. ప్రస్తుత జగన్ సర్కారు ఇసుకను అంగడి సరుకుగా మార్చేసింది. ఇప్పుడు ఏకంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక రీచులను ఒకే కంపెనీకి అప్పగించారు. నూతన ఇసుక విధానంలో భాగంగా ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు స్వీకరించింది ప్రభుత్వం. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు ఒకటిగా.. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఒక జోన్‌గా.. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు మరో జోన్‌గా టెండర్లు పిలిచారు. మూడు జోన్లలోనూ ఒకే సంస్థ ముందు నిలవడం ఆశ్చర్యంగా మారింది. ఇసుక టెండర్లను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ చేజిక్కించుకోవడంతో.. ఆ సంస్థతో గనుల శాఖ ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు, స్టాక్ యార్డ్ నిర్వహణ, అమ్మకాల్లో ఏప్రిల్ 1 నుంచి జేపీ పవర్ వెంచర్స్‌దే గుత్తాధిపత్యం.
ఇసుక టెండర్లలో L1గా నిలిచిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్.. జగన్ కేసుల్లో A3గా ఉన్న వ్యక్తికి చెందిన కంపెనీయే అంటున్నారు. తెర వెనుక పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో జరిగిందని.. అందుకే మూడు జోన్లూ.. జగన్‌రెడ్డికి కావలసిన వ్యక్తి కంపెనీకే దక్కాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు, జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ 3,504 కోట్ల నష్టాల్లో ఉందంటూ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ చూపిస్తున్నారు. గత 7 ఏళ్లుగా ఆ కంపెనీ నష్టాల్లో ఉంది. అలాంటి కంపెనీకి మొత్తానికి మొత్తం ఇసుకు రీచులన్నీ దక్కడం యాదృచ్చికమేమీ కాదంటున్నారు. ఇదంతా జగన్ కనుసన్నల్లో జరిగిన క్విడ్ ప్రోకో డీల్ అని ఆరోపిస్తున్నారు.
తెరపైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్. తెర వెనుక రాంకీ గ్రూప్. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పెదబోట్ల గంగాధర శాస్త్రి. అతను రాంకీ గ్రూప్‌లో గత 25 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగి. ఇతను రాంకీ గ్రూప్‌కి చెందిన కంపెనీలన్నింటిలోనూ డైరెక్టర్‌గా ఉన్నాడని అంటున్నారు. ఆ రాంకీ గ్రూప్ ఛైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. ఇతను జగన్మోహన్‌రెడ్డి ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ కేసుల్లో A3 నిందితుడు. ఇప్పటికే అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టారు జగన్. ఆ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అప్పటి క్విడ్ ప్రోకో కేసులో మాదిరే.. ఇప్పుటి ఇసుక రీచుల్లోనూ పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ.
నూతన ఇసుక విధానం అంటూ ఇప్పటి వరకూ మూడు సార్లు పాలసీ ఛేంజ్ చేశారు. నిలకడలేని నిర్ణయాలతో ఏపీలో నిర్మాణరంగం కుదేలైంది. పనులు లేక కూలీలు రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఏకంగా ఇసుకను ప్రైవేటు పరం చేశారు. తన అనునాయులకు రీచులు దారదత్తం చేశారు. ఆస్తుల కేసులో సహనిందితుడికి పరోక్షంగా ఇసుకను కట్టబెట్టి.. జగన్‌రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. మరి, 3వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్‌కు ఇసుక రీచుల కాంట్రాక్టులన్నీ కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటి జగన్మోహనా?