టన్ను ఇసుకపై రూ.1000 పెంపు... తెలంగాణలో మొదలైన ఇసుక సంక్షోభం
posted on Dec 17, 2019 @ 9:31AM
ఏపీలోనే కాదు తెలంగాణ లోనూ ఇసుక బంగారమైంది. ఒక్కసారిగా ఇసుక ధరకు రెక్కలొచ్చాయి. నిన్నమొన్నిటి వరకు టన్ను రూ.1400 రూపాయలకు అటు ఇటుగా ఉన్న ఇసుక ధర అమాంతంగా రూ.1000 రూపాయల వరకు పెరిగింది. ఈ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. ప్రభుత్వ విధానంతో పాటు మేడారం జాతర సందర్భంగా ఆంక్షలు విధించడం ఇందుకు కారణంగా చూపుతున్నారు. రాష్ట్రంలో సుమారు 23 ఇసుక రీచ్ లు ఉన్నాయి. వీటిలో 20 కి పైగా కమర్షియల్ రీచ్ లే. మిగిలినవి ఇరిగేషన్ డబుల్ బెడ్ రూమ్ లకు సంబంధించిన రీచ్ లు. ఇసుక రీచ్ లలో సుమారు 95 శాతం భూపాలపల్లి ప్రాంతం లోనే ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం నిర్మాణాలకు సంబంధం లేకుండా రాష్ట్రంలో నెలకు సుమారు 10 నుంచి 12 లక్షల టన్నుల ఇసుక డిమాండ్ ఉంది. అంటే ఏడాదికి 1.3 కోట్ల నుంచి 1.4 కోట్ల టన్నులు. కొత్త విధానంలో భాగంగా ఇసుకను రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. నదుల రీచ్ ల్లో ఇసుకను సేకరించి దగ్గరలోని స్టాక్ యార్డుల్లో నిలువ చేస్తున్నారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి అక్కడి నుంచి ఇసుకను లోడు చేస్తున్నారు. ఇసుక బుకింగ్ కు రాష్ట్రంలో సుమారు 25,000 లారీలు నమోదయ్యాయి.
రైతుల సంఖ్య, రోడ్ రవాణా అన్ని లారీలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రోజుకు 2,500 నుంచి 3000 లారీలకే అవకాశమిస్తున్నారు. దాంతో ఒక్కసారి అవకాశం దక్కిన లారీకి మరో ఐదారు రోజుల పాటు బుకింగ్ చేసుకునే అవకాశం వుండటం లేదు. ధరలు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా చూపుతున్నారు. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మేడారం జాతర కోసం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దాంతో రాత్రి వేళ అక్కడ లారీలకు అనుమతి ఇవ్వడం లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి. ఇదిలా వుంటే ఇసుక సరఫరాలో త్వరలోనే సాధారణ పరిస్థితి రానుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముల్సూర్ చెబుతున్నారు. కొన్ని కారణాల రీత్యా గత వారంలో ఇసుక బుకింగ్ ను పరిమితం చేశామని ప్రస్తుతం సాధారణ రీతిలోనే బుకింగ్ కు అవకాశమిస్తున్నామని అంటున్నారు. ఏమైనా తెలంగాణ లోనూ ఇసుక ధరకు రెక్కలు రావడం నిర్మాణ రంగానికి దెబ్బగా మారింది.