సల్మాన్ ఖాన్ కోరుండి ఆ తప్పు చేయలేదు: చిరంజీవి
posted on May 6, 2015 @ 10:29PM
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ని ‘హిట్-అండ్-రన్’ కేసులో ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి, ఐదేళ్ళు జైలు శిక్ష విధించడంపై బాలీవుడ్ లో చాలా మంది విచారం వ్యక్తం చేసారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి అందరి కంటే ముందుగా కాంగ్రెస్ యంపీ చిరంజీవి స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ కి జైలు శిక్ష పడటం తనకు చాలా విచారం కలిగిస్తోందని అన్నారు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదానికి, ఉద్దేశ పూర్వకంగా చేసిన దానికి తేడా చూడాలని ఆయన అన్నారు. సెషన్స్ కోర్టులో శిక్ష పడినప్పటికీ హైకోర్టులో అప్పులు చేసుకొని బెయిలు పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
సాటి నటుడిగా చిరంజీవి ఆవిధంగా మాట్లాడటం సహజమే అయినా కోర్టు దోషిగా నిర్ధారించిన సల్మాన్ ఖాన్ నేరం చేయలేదన్నట్లు మాట్లాడటం చాలా పొరపాటేనని చెప్పక తప్పదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తప్పత్రాగి కారు నడిపినప్పుడు అది అదుపు తప్పి ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తుల మీద నుండి వెళ్ళడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆయన కారు ఆపకుండా వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టుకి రప్పించినప్పుడు కూడా తను నిర్దోషినని వాదించారు. తనకున్న అర్ధబలంతో గత 13ఏళ్లుగా కేసును సాగదీసుకొంటూ ఇంతకాలం శిక్ష పడకుండా తప్పించుకొన్నారు. అంతే కాదు ఆయన చివరికి కోర్టును కూడా త్రప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తన కారును తన డ్రైవరు నడుపుతున్నాడని బుకాయించే ప్రయత్నం చేసారు.
అంటే మొదట ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకొందామని ప్రయత్నించిన సల్మాన్ ఖాన్ అది సాధ్యం కాకపోవడంతో ఆ ప్రమాదం తన కారు వలననే జరిగిందని అంగీకరించినట్లయింది. కోర్టును త్రప్పు ద్రోవ పట్టించే ప్రయత్నంలో సల్మాన్ ఖాన్ అన్యాయంగా తన డ్రైవరును తన కేసులో ఇరికించే ప్రయత్నం కూడా చేసి మరో నేరానికి పాల్పడ్డారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో అతనే తప్ప త్రాగి కారు నడుపుతూ ఒకరి మరణానికీ, నలుగురు గాయపడటానికి కారకుడయ్యాడని కోర్టు ద్రువీకరించినప్పుడు, తను చేసిన సమాజసేవలను దృష్టిలో పెట్టుకొని శిక్షను తగ్గించమని కోరడం గమనిస్తే ‘దొరికితే దొంగలు దొరకకపోతే దొరలూ’ అన్నట్లు ఇంతకాలం ఆయన వ్యవహరించినట్లు అర్ధమవుతోంది.
ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రమాదం చేసి ఉండకపోవచ్చును. కానీ ఆ తరువాత శిక్షను తప్పించు కోవడానికిగాను వరుసగా తప్పు మీద తప్పు చేసుకొంటూ వెళ్ళారు తప్ప ఏనాడు నిజాయితీగా కోర్టులో తన నేరాన్ని అంగీకరించలేదు. కనుక ఏనాడూ తనను క్షమించి విడిచిపెట్టమని ఆయన కోర్టుని ప్రాదేయపడలేదు. కానీ ఇప్పుడు కోర్టు శిక్ష ఖరారు చేయబోతుంటే ఆయన తను చేసిన తప్పుకి క్షమించమని అడుగుతున్నారు అటువంటి వ్యక్తిని చిరంజీవి వెనకేసుకు వస్తున్నారు. ఆ ప్రమాదం తరువాత సల్మాన్ ఖాన్ అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేసి ఉండవచ్చును. కానీ అంతమాత్రాన్న ఆయన చేసిన ఈ నేరం నేరం కాకుండాపోదు. ఒకవేళ అటువంటి సమాజాసేవా కార్యక్రమాలు చేసినందుకు దోషులకు కోర్టులు శిక్షలు వేయకుండా వదిలిపెట్టడం మొదలుపెట్టినట్లయితే చాలా మంది అటువంటి మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులతో మంచి స్నేహసంబందాలున్నవారు వారిని అభిమానించేవారు సానుభూతి వ్యక్తం చేయడంలో అసహజమేమీ లేదు. కానీ వారిని వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో కోర్టు తీర్పును తప్పుపట్టినట్లు మాట్లాడటమే పెద్ద తప్పు. రాజకీయాలలో ఉన్న చిరంజీవికి ఈ విషయం తెలిసే ఉంటుందని అందరూ అనుకొన్నారు. కానీ...