పీకే ప్రసంగాలకు పవర్ కట్.. ఇదేం రాజకీయం సారూ!
posted on Aug 4, 2021 @ 3:27PM
హుజూరాబాద్ లో గెలిచి తీరాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకోసం హడావుడిగా దళితబంధు స్కీముతో పాటు నాగార్జునసాగర్ వంటి నియోజకవర్గాలకు ఇదే అదునుగా వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇటీవలే రాజీనామా చేసి ఆ వెంటనే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు బెంగపడుతున్నాయి. దళిత-బహుజనవాదానికి కాన్షీరాం తాత్వికతను జోడించి కొత్త తరహాలో రోజుకో జిల్లాలో ప్రవీణ్ కుమార్ ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు. కేసీఆర్ మోసకారితనం, మాట మీద నిలకడ లేనితనం, కేసీఆర్ చేసే ఎలక్షన్ రాజకీయాల మీద పదునైన మాటల బాణాలు వదుల్తున్నారు. ఆయన ఉపన్యాసాల ప్రభావం యావత్ రాష్ట్రం మీద పడుతున్నా.. ఇప్పటికిప్పుడు హుజూరాబాద్ ఎన్నికలను కూడా గణనీయంగా ప్రభావితం చేసేలా ఉందన్న బెంగ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
హుజూరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్.. తన ఉపన్యాసాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తాజాగా ప్రవీణ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. గత మూడు రోజులుగా జరుగుతున్న అన్ని సమావేశాల్లోనూ తాను మాట్లాడే సమయానికే పవర్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తను మాట్లాడకుంటా కరెంట్ కట్ చేస్తున్న పాలకులు.. రేపు తామే వారి పవర్ ను కట్ చేయబోతున్నామని ట్వీట్ చేస్తూ తాజా ఫొటోను కూడా జత చేశారు.
పీకే ట్వీట్ కు ట్వీట్లు, రీట్వీట్లు పడిపోతున్నాయి. స్వేరో సైన్యంతో పాటు పీకే ఫ్యాన్స్ పెద్దఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు పవర్ కట్ చేయడం ఖాయమని కొందరు స్పందిస్తున్నారు. మరికొందరేమో.. పీకే అప్పుడే ఫక్తు పొలిటికల్ డ్రామాలు నేర్చుకున్నారని, తెలంగాణ పల్లెల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో పవర్ పోయుంటుంది తప్ప పీకేకు భయపడి కేసీఆరే తీయించినట్లు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు దేశంలో ఎక్కడా లేనట్టు తెలంగాణలో 24 గంటల పవర్, రైతులకు ఉచిత పవర్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకరిద్దరైతే... ఇలాంటి సమావేశాలు పెట్టుకున్నప్పుడు స్వయంగా ఓ జనరేటర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సార్.. అంటూ సూచిస్తున్నారు.
మొత్తానికి కరెంటు పోయిన రీజన్ ఏంటో తెలీదు గానీ.. ఈ అంశాన్ని ట్విట్టర్లో పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్న పీకే ఓట్లదృష్టిని మాత్రం పలువురు ప్రశంసిస్తున్నారు.