కులాల వారీగా పదవులు, పంపకాలు! హుజురాబాద్ లో గులాబీ వ్యూహాలు..
posted on Aug 4, 2021 @ 2:35PM
హుజురాబాద్.. తెలంగాణలో ఇదే ఇప్పుడు సెంటర్ పాయింట్. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న కరీంనగర్ జిల్లా హజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీల మంత్రాంగంతా దానిపైనే ఉంది. పార్టీలే కాదు ప్రభుత్వ పాలన కూడా హుజురాబాద్ కేంద్రంగానే సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలన్ని ఉపఎన్నికకు ముడిపడే ఉంటున్నాయి.
2004 నుంచి హుజురాబాద్ లో గెలుస్తూ వస్తున్నారు ఈటల రాజేందర్. ఆరుసార్లు పోటీ చేయడంతో నియోజకవర్గం ఆయనకు కంచుకోటగా మారింది. అయితే ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈటల రాజేందర్.. ఈసారి మాత్రం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మరోసారి గెలిచి తన సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి తొలగించారనే సానుభూతి ప్రజల్లో ఈటలపై కనిపిస్తోంది. అటు ఈటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నిర్వహించిన సర్వేల్లో మాత్రం ఈటల వైపే మొగ్గు ఉందని తేలిందట. రెండు, మూడు సార్లు సర్వే చేసినా అదే ఫలితం రావడంతో గులాబీ బాస్ కలవరపడుతున్నారట. అందుకే ఎలాగైనా గెలిచేందుకు సీఎం కేసీఆర్ అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నారని అంటున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో కులాల వారీగా లెక్కలు తీస్తూ పంపకాలకు దిగుతున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పథకాలతో తాయిలాలు ఇస్తున్నారు. పంపకాలే కాదు పదవుల్లోనూ కులాల వారీగా నియమిస్తూ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఇటీవల నామినేటెడ్ చేసిన పోస్టులన్ని హుజురాబాద్ కే దక్కాయి. ఇకపైనా దక్కబోతున్నాయని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని నామినేట్ చేయగా.. ఇటీవల కాంగ్రెస్ నుంచి కారెక్కిన హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డికి దక్కింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించగా.. అది కూడా హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్ కు దక్కింది. ప్రభుత్వ పథకాల అమలు కూడా హుజురాబాద్ కేంద్రంగానే మొదలవుతున్నాయి.
హుజురాబాద్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. మొత్తం 2 లక్షల 29వేల పైచిలుకు ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు 64శాతం, ఎస్సీలు 20శాతం, ఓసీలు 10శాతం ఎస్టీలు 2శాతం, ఇతరులు 4శాతం ఉన్నారు. కులాల వారీగా, మాల మాదిగలు 45వేలు, కాపులు 29వేలు, పద్మశాలీలు 28వేలు, గౌడ, ముదిరాజ్‌లు 26 వేల చొప్పున, గొల్లకుర్మలు 25వేలు, రెడ్డీలు 22వేలు, ముస్లింలు 12వేలు, ఎస్టీలు 6500 ఓటర్లున్నారు. నియోజకవర్గంలో దళితుల ఓట్లు 45 వేలకు పైగా ఉన్నాయి. అందుకే వీళ్ల టార్గెట్ గానే దళిత బంధుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. దళిత బంధును పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు. ఈ స్కీం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం చేయనున్నారు. మొదట నియోజకవర్గానికి100 కుటుంబాలకే ఇవ్వాలని నిర్ణయించినా.. తర్వాత మార్చేశారు కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలకు మొత్తంఅందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 20 వేల కుటుంబాలకు సాయం చేయనున్నారట. ఈ లెక్కన 10 లక్షల రూపాయలు అందించి.. మాల మాదిగల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.
హుజురాబాద్ నియోజకవర్గంలో కాపుల ఓట్లు 29 వేలు ఉన్నాయి. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత కాపులంతా కమలానికి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ల ఓట్లపైనా ఫోకస్ చేసిన కేసీఆర్.. కాపు సామాజిక వర్గానికే చెందిన మంత్రి గంగుల కమలాకర్ ను నియోజకవర్గంలో తిప్పుతున్నారు. అంతేకాదు కాపు వర్గానికి చెందిన జమ్మికుంట మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొనగంటి మల్లయ్య పేరును టికెట్ కోసం పరిశీలిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఆయనకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. కాపుల్లో మంచి పట్టున్న మల్లయ్యతో ఆ ఓట్లకు గాలం వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 28 వేల పద్మశాలీ ఓటర్లున్నారు. ఇటీవల కారెక్కిన ఎల్ రమణతో వాళ్ల ఓట్లకు టెండర్ పెట్టారట. నియోజకవర్గానికి చెందిన పద్మశాలి వర్గానికి చెందిన నేత సరగం రవిని కూడా తన పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సరగం రవికి ప్రజల్లో మంచి పేరుంది. వీళ్లద్దరి ద్వారా పద్మశాలి ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు గులాబీ బాస్.
హుజురాబాద్ నియోజకవర్గంలో ముదిరాజులతో సమానంగా గొల్ల కుర్మల ఓట్లు దాదాపు 28 వేలు ఉన్నాయి. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని ఆలోచించడానికి ఇదే కారణమని తెలుస్తోంది. గెల్లుకు టికెట్ వస్తుందని లీకులు ఇస్తూ ఆ వర్గం మద్దతు కొట్టేయాలని చూస్తున్నారట కారు పార్టీ నేతలు. గెల్లుకు టికెట్ వచ్చినా .. రాకున్నా యాదవ ఓట్లు తమకే పడేలా.. మూడేండ్లుగా పెండింగులో ఉన్న గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇది కూడా తమకు కలిసివస్తుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గానికే చెందిన బీసీ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్‌కు బీసీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓట్లను కౌశిక్ రెడ్డి కవర్ చేస్తారని భావిస్తున్నారు. ఆ కోణంలోనే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని అంటున్నారు. ఇక ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు.. ఎలాగు బీజేపీని ఓడించేందుకు తమకే సపోర్ట్ చేస్తారని లెక్కలు వేస్తోంది టీఆర్ఎస్. ఇటీవలే గులాబీ గూటికి చేరిన పెద్దిరెడ్డికి క్రిస్టియన్ వర్గంలో మంచి ఓటు బ్యాంక్ ఉందని చెబుతున్నారు.
ఇలా కులాల వారీగా పంపకాలు చేస్తూ, పదవులు ఇస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలతో విపక్షాలు కూడా షాకవుతున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఈటల వెంట ఉన్న నేతలకు కూడా గాలం వేస్తున్నారట గులాబీ లీడర్లు..