వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవమే.. రఘురామ ఫ్లాష్ సర్వే వెల్లడి
posted on Jan 18, 2023 @ 11:13AM
రాష్ట్రంలో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఊహకు అందనంత మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వైసీపీ రెబల్ ఎంపీ కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయనిరఘురామకృష్ఱం రాజు అన్నారు. తాను ప్రాంతాల వారిగా ఇటీవల నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో తెలుగుదేశం కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేట తెల్లమయిందని చెప్పారు.
మంగళవారం (జనవరి 17) రచ్చబండ కార్యక్రమంలో ఆయన ఉత్తరాంధ్ర లో పది నుంచి 12 శాతం టిడిపికి ఎడ్జ్ ఉంటే, ఉభయగోదావరి జిల్లాలలో అది 14 నుంచి 16 శాతం, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12 నుంచి 14 శాతం, ఒంగోలు నెల్లూరులలో ఎనిమిది నుంచి పది శాతం, అనంతపురం, కర్నూలులలో 10 నుంచి 12 శాతం, కడప చిత్తూరులలో 6 నుంచి 8 శాతం ఉందని వివరించారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని తాను మొదటి నుంచి చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వై నాట్ 175 అని వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు ఎంతగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా, వాస్తవం వారికి పూర్తిగా ప్రతికూలత ఉందని స్పష్టమైతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే వైసీపీకి దారుణమైన పరాభవం తప్పదని అనిపిస్తోందని అన్నారు. గత ఎన్నికలలో వైసీపీ గెలుపునకు దోహదపడిన బాబాయ్ హత్య, కోడి కత్తి కేసులు ఇప్పుడు అధికార పార్టీకి బూమరాంగ్ అవుతాయన్నారు.
అప్పుడు వైసీపీ వైఎస్ వివేకా హత్య వెనుక తెలుగుదేశం ఉందని ఆరోపించిందనీ, అలాకే కోడి కత్తి తో తనను హత్య చేయడానికి తెలుగుదేశం ప్రయత్నించిందని చాటుకుని జగన్ సానుభూతి పొందారనీ, ఇప్పుడా రెండు కేసుల వెనుక ఉన్నది ఎవరన్నది స్పష్టంగా తేలిపోవడంతో.. నాడు వైసీపీకి ప్లస్ అయిన ఈ రెండు కేసులూ కూడా మైనస్ అయి ఆ పార్టీ పుట్టి ముంచబోతున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.