కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారం.. అదే బీజేపీ లక్ష్యం
posted on Jan 18, 2023 @ 1:14PM
ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నదే ఆ దిశా నిర్దేశం. ఇప్పటికే వరుసగా రెండు సార్లు తన నాయకత్వంలో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, దేశంలోని మోజారిటీ రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే లా విజయవంతంగా వ్యూహాలు పన్నిన మోడీ.. ముచ్చటగా హ్యాట్రిక్ విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేయడమే కాకుండా.. పార్టీ శ్రేణులకు కార్యాచరణ ప్రాణాళికను కూడా ఇచ్చేశారు.
మరో 400 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా యువ ఓటర్ల వద్దకు పార్టీ చేరుకోవాలని మోడీ పార్టీ కార్యవర్గ సమావేశాలలో ఉద్బోధించారు. 18-25 ఏళ్ల మధ్య ఉన్న ప్రజలందరినీ పార్టీ రీచ్ అవ్వాలనీ.. యువతను పార్టీ చేరుకోగలిగితే విజయం సులభ సాధ్యమౌతుందని ప్రధాని మోడీ ప్రభోదించటం వెనుక భారీ స్కెచ్ ఉందంటున్నారు.
పరిశీలకులు. దేశంలో యువ జనాభా, యువ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు ఫస్ట్ టైం ఓటర్లే..కాబట్టి యువతను ఆకట్టుకుంటే ఆ కుటుంబాన్నంతా గంపగుత్తగా ఆకట్టుకున్నట్టేనన్నది మోడీ ఉద్దేశంగా చెబుతున్నారు. యువతకు రాజకీయాలంటే ఆసక్తి ఉన్నా పెద్దగా పట్టుండదని పైగా చరిత్ర, సమకాలీన పరిస్థితులపై సరైన అవగాహనా ఉండదు కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇందుకు సామాజిక మాధ్యమాన్ని మించిన వేదిక, సాధనం లేదని మోడీ విస్పష్టంగా చెప్పారు.
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఎకానమీగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత తమదేనంటూ ప్రజల్లో ఊదరగొట్టడాన్ని బీజేపీ తన అజెండాలో పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం కూడా ఇదేనని పరిశీలకులు వివ్లేషిస్తున్నారు. రామ మందిర నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టడం మొదలు.. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 360ని ఉపసంహరించటం వరకూ గత రెండు దఫాలుగా మోడీ సర్కారు చేపట్టిన నిర్ణయాలను ప్రచారంలోకి తేవాలని డిసైడ్ అయినట్టు మోడీ మాటలను బట్టి అవగతమౌతోంది. సంతృప్తికరమైన పాలన అన్న నినాదంతో 2024 లోక్ సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోందన్నది వారి విశ్లేషణల సారాంశం.
అందుకే మోడీ బీజేపీ ఇప్పుడు కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమం అని మోడీ అంటున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను ఆదిలోనే చిత్తులు చేసేలా ఆస్త్రాలను సంధించే పని బీజేపీ ఇప్పటి నుంచే మొదలెట్టేసింది. దేశ భవిష్యత్తు గొప్పగా, ఉజ్వలంగా ఉంటుందని భరోసా కలిగేలా, విపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని నమ్మేలా ప్రజలలో ప్రచారాన్ని ఊదరగొట్టేయడమే బీజేపీ తాజా వ్యూహం అని పార్టీ కార్యవర్గ సమావేశంలో మోడీ ప్రసంగాన్ని బట్టి అర్థమౌతుంది.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ తెలంగాణ బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలన్న మోడీ మాటలు తెలంగాణ బీజేపీకి పెద్ద టానిక్ లా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేపట్టిన యాత్ర బాగుందని.. దీన్ని మిగతా రాష్ట్రాలు రోల్ మోడల్ గా తీసుకోవాలని మోడీ చెప్పటం మిగతా రాష్ట్రాలపై గట్టి ప్రభావం చూపటం ఖాయం. ఇంత భారీ యాత్రను బండి ఎలా చేపట్టారో అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపాలన్న మోడీ నిర్ణయం దక్షిణాదిలో బీజేపీకి మరింత ఉత్సాహాన్ని, ఊపునూ తీసుకువస్తుందన్నది ఆయన ఉద్దేశం, ఎత్తుగడగా కనిపిస్తోంది. దేశంలో మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రభావమంతంగా ప్రచారం చేసుకోవడంలో పార్టీ సఫలం కాలేదన్నది రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయం. అందుకే అన్నిరకాల ప్రచార, ప్రసార సాధనాలను గరిష్ఠంగా ఉపయోగించుకునేలా సన్నద్ధం కావాలన్నది మంగళవారం ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయంగా చెప్పాలి.
కర్నాటక, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగనున్న ప్రతి అసెంబ్లీ ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే 2024లోక్ సభ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్నది మోడీ ప్రసంగ సారాంశం.
2023 ఏడాది పార్టీ దృష్ట్యా అత్యంత ముఖ్యమైన సంవత్సరమని పదేపదే నద్దా, మోడీ-షాలు పేర్కొంటుండటం వెనుక ఉన్న కారణం కూడా ఇదే. అలాగే బీజేపీకి కొరకరాని కొయ్యలుగా మారిన 160 లోక్ సభ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయా నియోజకవర్గాలలో పాగా వేసేలా కార్యచరణను చేపట్టాలని మోడీ ఆదేశం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ తోపాటు సబ్కా ప్రయాస్ కూడా అవసరం అంటూ మోడీ కొత్త నినాదాన్ని పార్టీకి అందించారు. ఓబీసీలను మరింత మచ్చిక చేసుకుని, ఎస్సీ, ఎస్టీలను తమ పార్టీ వైపుకు పెద్ద ఎత్తున మళ్లించేలా కమలనాథులు చేస్తున్న కృషి సరిపోదని.. అన్ని రాష్ట్ర శాఖలు మరింత కృషి చేయాలంటూ ఎండ్ టు ఎండ్ ఎన్నికల సిద్ధాంతాన్ని వల్లె వేస్తూ బీజేపీ లీడర్లందరికీ కార్యవర్గ సమావేశం టార్గెట్లు నిర్దేశించింది.
ఈ ఏడాది జరిగే 9 అసెంబ్లీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తే తప్ప వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం అన్న పార్టీ లక్ష్యం సాకారదన్న ఉద్దేశంతో బీజేపీ కార్యవర్గ సమవేశం వేదికగా నిర్ణయించింది.