ఎంపీల బూతు పురాణం.. పార్లమెంట్ లో పరువు గోవిందా !
posted on Dec 7, 2021 @ 12:08PM
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ నడుస్తోంది. తెలుగు ప్రజల పరువు తీసే విధంగా ఉభయ రాష్ట్రాల అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన అసభ్యంగా ఉంటోంది.ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు బూతులు చల్లుకున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మంత్రుల మధ్య కూడా తిట్ల పురాణం సాగింది. ఇక ఇప్పుదు ఏకంగా దేశ రాజదాని ఢిల్లీలో, అది కూడా ప్రజాస్వామ్య దేవాలయం అనుకునే పార్లమెంట్’లో ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల సభ్యుల ప్రవర్తన తెలుగు ప్రజల పరువు తీసేలా ఉందని, పార్లమెంట్ లో జరుగతున్న పరిణామాలను గమనిస్తున్న ప్రజలు, పరిశీలకులు విచారం వ్యక్త పరుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, మంత్రులు,ఎమ్మెల్యేలు చివరకు అధికార పార్టీ సాధరణ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా,భాష విషయంలో వైసీపీ తయారు చేసుకున్న బూటు వ్యాకరణ సహిత ‘కొత్త నిఘంటువు’నే ఫాలో అవుతున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడి శ్రీమతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఏవిధంగా అవమానించింది. ఎంతలా బాధించింది చూశాం.. చివరకు అంతటి నాయకుడు,జీవితంలో మొదటి సారి మీడియా ముందు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం కాదు, బోరుబోరున విలపించారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత చట్ట సభల దుస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు.ఇంకా విషాదం, అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన, వారి భాషను, సభా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సమర్ధించారు. ఆయన తమ స్థాయిని మరిచి మాజీ ముఖ్యమంత్రి బాధను, ‘డ్రామా’ అంటూ మరింత గాయ పరిచారు. చివరకు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా సభలో అసలేమీ జరగలేదు, ఎవరూ గీత దాటలేదని బూతు బాబులకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు.ఈ వ్యవహారం వైసీపీ కుసంస్కారాన్ని, స్త్రీలపై ఆపార్టీకి ఉన్న నీచమైన అభిప్రాయాలను బయట పెట్టింది.
శాసనసభలో కానీ, పార్లమెంట్ లో కానీ, రాష్ట్రంలో జరుగతున్న అవినీతిని, హత్యా రాజకీయాలను, అధికార దుర్వినియోగాన్ని అసమర్థ నిర్ణయాలను, దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను ఎవరైనా విమర్శిస్తే వారిపై భౌతికంగా కాకపోతే సంస్కారహీనమైన భాషతో దాడులు చేయడాన్ని వైసీపీ ‘ప్రవర్తనా నియమావళి’ గామార్చుకుందా, అనుకునేలా సభ్యుల ప్రవర్తన ఉంటోంది.చివరకు, పార్టీతో విభేదించిన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై కూడా అధికార పార్టీ సభ్యులు అదే విధంగా ప్రవర్తించారు. రాయకూడని దుర్భాషలాడారు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణిని అవమానిస్తే, లోక్ సభలో సొంత పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు తల్లిని ... అవమానించే విధంగా .. దూషించారు.
రాష్ట్రంలో భారీ వరదల భీభత్సం జరిగితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించినట్లుగా వ్యవహరించి, కేంద్రం ముందు చులకనయ్యారు.ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో ప్రకృతి విలయంతో అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయి గ్రామాలు కొట్టుకుపోయిన విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెఖావత్ పార్లమెంట్‌లో ప్రకటించి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని జాతీయ స్థాయిలో బహిర్గతం చేశారు. తమ తప్పు ఒప్పుకునే బదులు వైసీపీ సభ్యులు కొందరు కేంద్రమంత్రిపైనే దాడికి రాష్ట్ర ప్రజల పరువును మరింత దిగజార్చారు. ఇంకొక అధికార పార్టీ ఎంపీ అయితే, ఉద్యుగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడ లేదని, రాష్ట్ర అర్థిక పరిస్థితి దయనీయ స్థితిని పార్లమెంట్ వేదికగా ప్రపంచానికి రాష్ట్ర పరువును దిగజార్చారు.
ఇక తెలంగాణ ఎంపీల విషయానికి వస్తే వరి విషయంలో అనవసర వివాదాన్ని సృష్టించి, రోజుకో వేషం వేస్తూ రాష్ట్ర పరువు తీసుకుంటున్నారు. కారణాలు కొంత భిన్నంగా ఉన్నా, తెలు ప్రజల పరువును పలచన చేయడంలో తెరాస సభ్యులు ఏమాత్రం తీసిపోలేదు. ఏపీ ఎంపీలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెఖావత్ వాతలు పెడితే, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్, సహాయమంత్రి నిరంజన్ జ్యోతి పార్లమెంట్ సాక్షిగా వరి ధాన్యం సేకరణకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందుంచడం ద్వారా టిఆర్‌ఎస్ నేతలకు చురకలు అంటించారు. మొత్తానికి ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల సభ్యులు తెలుగు వారి పరువును పార్లమెంట్ సాక్షిగా దిగజార్చారు.