రాజీలేని రోజా.. పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ...
posted on Oct 9, 2021 @ 4:04PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సీఎం జగన్ తర్వాత అంతటి స్థాయి ఉన్నవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన పాదయాత్రకు ఫండింగ్ అంతా ఆయనదే. అందుకే, జగన్ అధికారంలోకి వచ్చాక.. కీలకమైన శాఖను పెద్దిరెడ్డికి కట్టబెట్టి.. ఆర్థికంగా ఆయన రుణం తీర్చుకున్నారని అంటారు. ఒకవేళ సీబీఐ కేసుల్లో జగన్ బెయిల్ రద్దు అయి జైలుకెళితే.. ముఖ్యమంత్రి పీఠం సైతం పెద్దిరెడ్డిదేననే ప్రచారమూ ఉంది. వైసీపీలో ఇంతటి ఖతర్నాక్ లీడర్‌కు.. ఎమ్మెల్యే రోజా ఎప్పటికప్పుడు జబర్దస్థ్ ఝలక్ ఇస్తున్నారు. జగన్‌కు చెల్లెలినంటూ.. నగరి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. రోజా, పెద్దిరెడ్డిల మధ్య దశాబ్దాల వైరం ఉంది. ఇద్దరి మధ్య ఏళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. సీఎం జగన్‌కు పెద్దిరెడ్డి ఎంతటి ప్రధాన నాయకుడైనా కూడా.. రోజా విషయం వచ్చే సరికి జగన్ సైతం సైడ్ అయిపోతుంటారు. వారి వైరంలో జగన్‌రెడ్డి జోక్యం చేసుకోరు. దీంతో.. రోజా వర్సెస్ పెద్దిరెడ్డి ఎపిసోడ్ చిత్తూరు జిల్లాలో హాట్ హాట్‌గా సాగుతూ ఉంటూనే ఉంటుంది.
తాజాగా, నిండ్ర మండలాధ్యక్ష ఎన్నికల్లో పెద్దిరెడ్డి, రోజాల మధ్య పోరు మరోసారి హీట్ పుట్టించింది. పెద్దిరెడ్డి నేరుగా ఎంట్రీ ఇవ్వకుండా పరోక్షంగా తన మనుషులైన చక్రపాణిరెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో రోజాకు చెక్ పెట్టేలా రాజకీయం చేశారు. కానీ, చివరాఖరికి రోజా చేతిలో పెద్దిరెడ్డికి పరాభవం తప్పలేదు. ఇలా పదే పదే రోజా దూకుడు ముందు పెద్దిరెడ్డి పరపతి పనికిరాకుండా పోతుండటంతో పెద్దాయన తీవ్ర అవమాన భారానికి లోనవుతున్నారని అంటున్నారు. ఇంతకీ నగరి నియోజకవర్గంలో అసలేం జరిగిందంటే...
మండల పరిషత్ ఎన్నికల్లో నిండ్ర మండలంలో వైసీపీ ఘన విజయం సాధించింది. మండలాధ్యక్షుడిగా శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి కైవసం చేసుకోవాలని చూశారు. దీనికి నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర అభ్యంతరం చెప్పారు. తన ఏరియాలో తాను చెప్పిన వారికే మండలాధ్యక్ష పదవి ఇవ్వాలి కానీ, ఇక్కడ పెద్దిరెడ్డి వర్గీయుల పెత్తనం ఏంటని అడ్డుచెప్పారు. ఎంపీటీసీ దీప పేరును రోజా ప్రతిపాదించారు. దీంతో ఇటు పెద్దిరెడ్డి వర్గం, అటు రోజా వర్గం.. వ్యూహప్రతివ్యూహాలతో పలుమార్లు అధ్యక్ష ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. భాస్కర్‌రెడ్డిపై నేరుగా మంత్రి పెద్దిరెడ్డికే ఫిర్యాదు చేసి రాజకీయ చాణక్యం ప్రదర్శించారు రోజా. అయినా, ఫలితం లేకపోవడంతో చివరాఖరికి పంచాయితీ సీఎం జగన్ దగ్గరికి చేరింది.
ఇటు వైసీపీ టాప్ లీడర్ పెద్దిరెడ్డి.. అటు దేవుడిచ్చిన చెల్లెమ్మ రోజమ్మ. ఇద్దరిలో ఎవరి వైపు నిలవాలో జగన్‌కు సైతం పెద్ద పరీక్షే పెట్టింది. ఇరువురి వాదనలు విన్నాక.. నగరి నియోజకవర్గంలో ఎన్నిక కాబట్టి.. స్థానిక ఎమ్మెల్యే అయిన రోజా సూచించిన దీపకే జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పదే పదే తన పరిధి దాటి.. రోజా ఇలాఖాలో మంత్రి పెద్దిరెడ్డి వేలు పెడుతుండటంపై సీఎం జగన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని తెలుస్తోంది.
జగన్ జోక్యంతో పెద్దిరెడ్డి ఫుల్‌గా డిసప్పాయింట్ అయ్యారట. ఎలాగైనా రోజాకు చెక్ పెట్టి.. తన వర్గీయుడైన చక్రపాణిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో నగరిని కట్టబెట్టాలని ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మిగతా విషయాల్లో పెద్దిరెడ్డికి జగన్ సపోర్ట్ ఫుల్‌గా ఉన్నా.. ఎమ్మెల్యే రోజా విషయం వచ్చేసరికి ఆయన ఆమె వైపే మొగ్గు చూపడం మంత్రి రామచంద్రారెడ్డికి మింగుడు పడటం లేదు. జస్ట్ రోజానే ఎదుర్కోలేని ఆయన.. జగన్ జైలుకు వెళితే సీఎం అవుదామని ఎలా కలలు కంటున్నారో అర్థం కావడం లేదంటూ.. రోజా వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు.