ఆడుదాం ఆంధ్రా స్కాం.. మాజీ మంత్రి రోజా అరెస్టుకు ముహూర్తం ఖరారైందా?
posted on Sep 1, 2025 @ 4:15PM
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆధారాలు లేని ఆరోపణలతో, అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన మాజీ మంత్రి రోజ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలకు, మరీ ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ విజిలెన్స్ దర్యాప్తు తేల్చడంతో ఇప్పుడు ఇహనో అరెస్టు అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న రోజాపై ఇప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆడుదాం ఆంధ్రా స్కాంపై దర్యాప్తు పూర్తయ్యింది. విజిలెన్స్ తన దర్యాప్తు నివేదికను డీజీపీకి అందజేయడం కూడా జరిగింది. దీనిపై సాప్ చైర్మన్ రవినాయుడు ఈ నెల 5వ తేదీ లోగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్య తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించి విజిలెన్స్ నివేదిక అందింది ఈ స్కాంలో ప్రమేయం ఉన్న వారందరిపై లింగ వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని, ఈ నెల 5 లోగా అరెస్టులు ఉంటాయనీ సాప్ చైర్మన్ రవినాయుడు చేసిన వ్యాఖ్యలతో రోజా అరెస్టునకు రంగం సిద్ధమైందా అన్న చర్చ జోరందుకుంది.
జగన్ హయాంలో ప్రభుత్వం రూ. 119 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉణ్న సంగతి తెలిసిందే. బహుమతి డబ్బు పంపిణీలో దుర్వినియోగం, నాసిరకం స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీపై పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. జాతీయ కబడ్డీ మాజీ ప్లేయర్ ఆర్డీ ప్రసాద్ ఆడుదాం ఆంధ్ర అక్రమాలు, కుంభకోణంపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొత్తం అప్పటి మంత్రి రోజా, అప్పటి సాప్ చైర్మన్ పెత్తనం కిందే జరిగింది. ఈ నేపథ్యంలోనేఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని వారెంతటి వారైనా సెప్టెంబర్ 5 లోగా అరెస్టు చేస్తామంటూ శాప్ చైర్మన్ రవినాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా రోజా అరెస్టు తధ్యమన్న చర్చకూ తెరలేపాయి.