కరోనాతో అజిత్ సింగ్ మృతి
posted on May 6, 2021 @ 10:47AM
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరిగింది. మరణాలు ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలొదిరారు. రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు , కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 సంవత్సరాల వయసులో చౌదరి అజిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ కన్నుమూశారు. చౌదరి అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. అనంతరం చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.అజిత్ సింగ్ మృతి పట్ల వివిధ పార్టీల రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్.. రాజ్యసభ, లోక్ సభ సభ్యుడిగా పని చేశారు. రైతు నేతగా ఆయన పేరు గడించారు. దేశంలో ఎక్కడా రైతు సమస్యలు ఉన్నా అజిత్ సింగ్ స్పిందించేవారు. అజిత్ సింగ్ 1939లో జన్మించారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (చికాగో)లో ఉన్నత విద్య అభ్యసించారు. అమెరికాలో 15 ఏండ్లపాటు కంప్యూటర్ ఇండస్ట్రీలో పనిచేసిన ఆయన.. తన తండ్రి చరణ్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశానికి తిరిగి వచ్చారు. 1986లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆహార శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ (ఆర్ఎల్డీ)ని స్థాపించారు. అనంతరం 2001లో వాజపేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 వరకు ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికారు.