రుషికొండ ప్యాలెస్ నిర్వహణ బాధ్యతలు టాటా గ్రూప్ కు?
posted on Jun 19, 2024 @ 12:14PM
సీఎంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో జరిగిన అవకతవకలు, నిష్పూచీగా తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాల కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనుకబడింది. బాధ్యత లేని వ్యక్తులు పాలకులు రాష్ట్రం ఏ స్థాయిలో వెనుకబడుతుందో జగన్ హయాంలో ఏపీ పరిస్థితిని చూస్తే అర్ధమౌతుంది. జగన్ నిర్వాకాల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కొత్తగా కొలువుదీరిని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రుషికొండకు బోడి గుండు కొట్టేసి, ఆ కొండపై గతంలో ఉన్న రిసార్టును కూల్చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కట్టించిన ప్యాలస్ ఎందుకూ కొరగాకుండా ఉంది. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను కూల్చేసి మళ్లీ టూరిజం ప్రాజెక్టు కడతామంటూ అబద్ధాలు చెప్పి, అత్యంత రహస్యంగా అక్కడో రాజభవనం లాంటి ప్యాలెస్ కట్టేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ కూలిపోయింది. కూటమి సర్కార్ కొలువుదీరింది. జగన్ పదవీచ్యుతుడైన తరువాతే రుషికొండ రాజభవనం రహస్యాలు బయటకు వచ్చాయి. జనం డబ్బుతో జగన్ తన జల్సాల కోసం కట్టుకున్న ప్యాలెస్ అన్నది వెల్లడైంది. జనం విస్తుపోయారు. ఎన్నికల ముందే ఈ బండారం బయటపడి ఉంటే.. జగన్ పార్టీకి ఆ పదకొండు స్థానాలూ కూడా వచ్చి ఉండేవి కాదని అంటున్నారు. సరే అదంతా పక్కన పెడితే..
ఇప్పుడా ప్యాలెస్ ను ఏం చేయాలన్నది కొత్త ప్రభుత్వం ముందున్న సమస్య. స్టార్ హోటల్ గా చేద్దామంటే ఆ ప్యాలెస్ లో ఉన్నది 12 బెడ్ రూంలే. టూరిజం భవనంగానూ పనికిరాదు. పోనీ సీఎం విశాఖ క్యాంప్ ఆఫీసుగా వినియోగిద్దామంటే సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు అంత ఖరీదైన ప్యాలెస్ ను వినియోగించడానికి అంగీకరించరు. 550 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన ఆ భవనాన్ని ఉపయోగకరంగా మార్చాలంటే ఏం చేయాలి? ఎవరికీ అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విలాస భవనం వినియోగం విషయంలో టాటా గ్రూప్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే టాటా గ్రూపు మూడు బ్రాండ్ల కింద హోటల్స్ ను నడుపుతోంది. అందులో పెద్ద బ్రాండ్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్. ఆ కంపెనీకి ఈ రుషికొండ ప్యాలెస్ నిర్వహణ బాధ్యత అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మేరకు ఇప్పటికే టాటా గ్రూప్ లో సంప్రదించినట్లు చెబుతున్నారు. అలా టాటా గ్రూప్ కు అప్పగించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని అన్నా క్యాంటీన్లకు వినియోగించాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.