కులగణన రూపంలో కలిసొచ్చిన అదృష్టం !
posted on May 3, 2025 @ 2:08PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృష్టం గురించి వేరే చెప్పనక్కర లేదు. ఇప్పుడే కాదు, ఆయన రాజకీయ జీవితంలో అడుగడుగునా అదృష్టం ప్రత్యేక ప్రేమ చూపిస్తూనే వుంది. చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే వుంది. అది ఏమిటి ఎలా అన్నది పక్కన పెడితే.. ఇప్పడు మళ్ళీ మరోమారు కులగణన రూపంలో అదృష్టం ఆయన్ని వరించిందని అంటున్నారు.
కలిసొచ్చే రోజులోస్తే.. నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. ఇదొకటే కాదు.. తెలుగులో అదృష్టం చుట్టూ అల్లుకున్న సామెతలు ఇంకా చాలానే ఉన్నాయి. అదృష్టం కలిసొస్తే పోయింది కూడా వెతుక్కుంటూ వెనక్కి వస్తుందని, అదృష్టం చెప్పి రాదు, దురదృష్టం చెప్పి పోదు.. ఇలా అదృష్టం చుట్టూ అల్లుకున్న సామెతలు ఎన్నో ఉన్నాయి. అలా ఉన్న అన్ని సామెతలు ఒకేసారి కట్ట కట్టుకుని కలిసొస్తే ... ఇక అలాంటి ఆదృష్టం గురించి అంతటి అదృష్టవంతుని గురించి వేరే చెప్పనక్కర లేదు.
అవును.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది అలాంటి అదృష్ట వంతుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించే. ఆయనకు పట్టిన అదృష్టం గురించే మనం ఇప్పుడు మాట్లాడు కుంటున్నాము. అవును. అదృష్టం మరీ ఇలా ఫెవికాల్ కంటే బలంగా అతుక్కోవడం ఎప్పుడో గానీ జరగదు. ముఖ్యంగా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అలాంటి అదృష్టవంతులు చాలా అరుదుగా కనిపిస్తారు. ముల్లు వెళ్లి అరిటాకు మీద పడినా, అరిటాకు వెళ్లి ముల్లు మీద పడినా అరటాకుకే నష్టం అన్నట్లుగా.. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి ముఖ్యమంత్రి పై కోపం వచ్చినా, అధిష్టానంపై ముఖ్యమంత్రి కోపం వచ్చినా ముప్పు ముఖ్యమంత్రి కుర్చీకే వస్తుందని అంటారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీలో పదవులు కాపాడుకోవడం కత్తి మీద సామని అంటారు.
ఒకటి రెండు నెలలు వెనక్కి వెళితే రేవంత్ రెడ్డి పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా ఉందనే ప్రచారం జోరుగా సాగింది. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చెడిందనీ.. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని పుంఖాను పుంఖాలుగా కథనాలు పుట్టుకొచ్చాయి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ కుడా ఇవ్వడం లేదని.. ఇక ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రి కుర్చీలో ఉండరని విశ్లేషణలు, వ్యూహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను,మెచ్చుకున్న రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించ లేదు. దీంతో ముఖ్యమంత్రి మార్పు తధ్యమనే ప్రచారం అప్పట్లో జరిగింది.అయితే అలాంటిది ఏమీ జరగక పోయినా.. అంతాబాగుందనే పరిస్థితి అయితే నిన్నమొన్నటి దాకా లేదన్నది నిజం.
అయితే.. అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏమి జరిగింది, పక్షం రోజుల క్రితం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అన్నది పక్కన పెడితే, కులగణన పేరిట అదృష్టం మళ్ళీ మరో మారు ఆయన తలుపు తట్టిది. వచ్చే జనగణనతో పాటుగా కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పర్యవసానం.. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అదృష్టం కలిసొస్తే పోయింది కూడా వెతుక్కుంటూ వెనక్కి వస్తుందనే సామెతను నిజం చేస్తూ.. రేవంత్ రెడ్డికి కుర్చీ పోతుందనే భయాన్ని తగ్గించిందని అంటున్నారు.
జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో శుక్రవారం ( మే 2) హస్తినలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం, తెలంగాణలో జరిగినట్లుగా దేశమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనకబాటుతనాన్ని నిర్ధారిస్తూ కులగణన జరిపించాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. కులగణన విషయంలో తెలంగాణ నమూనానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసింది. అంతే కాకుండా, సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన కులగణనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు చెపుతున్నారు.
అదొకటి అయితే.. ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగిందని అంటున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా. రేవంత్ రెడ్డి ఆశా జ్యోతిగా కనిపిస్తునారని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి అడక్కుండానే ఒకే రోజు శనివారం( మే3) కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. మరో కొందరు ముఖ్య నేతలు కూడా రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే.. బహుశా తొలిసారిగా తోడు పెళ్లి కొడుకు (భట్టి లేదా ఉత్తమ్ కుమార్) తోడు కేకుండా కేంద్ర నాయకులతో సమావేశమవుతున్న రేవంత్ రెడ్డి ఏమి మాట్లాడతారు? కేవలం కులగణన వరకే పరిమితం అవుతారా? చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా మడ్లదతారా? అనేది తేలక పోయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటన, గుర్తుండిపోతుందని అంటున్నారు . నిజానికి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆరోపించినట్లుగా బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కులగణనను తెర పైకి తెచ్చిందా లేడా అన్నది పక్కన పెడితే.. రేవంత్ రెడ్డికి మాత్రం మంచి చేసిందని అంటున్నారు.