రాహుల్ ముందు చూపు.. తెలంగాణపై రూ.160 కోట్లు భారం
posted on May 3, 2025 @ 2:29PM
దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ పార్టీ అధినాయకుడు గాంధీ చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటుగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడానికి రాహుల్ డిమాండే కారణమా; లేక ఇతరాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అది తమ నాయకుడు రాహుల్ గాంధీ సాధించిన విజయంగా పేర్కొంటూ సంబురాలు చేసుకుంటోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే,ఇంకో అడుగు ముందుకేసి రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా వుంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ కూడా ఈ దేశానికీ ఏది కావాలో ముందుగానే గుర్తించి దానిని సాధించే వరకు వదిలి పెట్టరు అంటూ రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేశారు. తప్పుకాదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో రాహుల్ గాంధీ ఒత్తిడి కూడా ఒక కారణం అయితే కావచ్చును. కానీ.. అదొక్కటే కారణం అనుకుంటే రేవంత్ రెడ్డి తప్పులో కాలేసినట్లే అవుతుంది. నిజానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్వాపరాలను గమనిస్తే.. రేవంత్ రెడ్డి తమ నేత రాహుల్ గాంధీకి ఆపాదించిన ‘ముందు చూపు’ కంటే మోదీ నిర్ణయంలోనే మరింత ముందు చూపు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతవరకు బంతి సర్కార్ కోర్టులో వుంది. ఇకపై.. ఆ పరిస్థితి ఉండక పోవచ్చని కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్పవలసిన సమాధానాలు చాలానే ఉంటాయి. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో స్పష్టంగా తెలియకుండానే తొందర పడి ప్రయోజనం ఉండందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, సుదీర్ఘంగా అలోచించి, రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకునే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అంటే.. కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న కులగణన అస్త్రాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడ ఉంటుందని అంటున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో కులగణన గురించి ఎందుకు ఆలోచించ లేదు? ఎందుకు నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ వరకు కులగణనను వ్యతిరేకించారు? ముఖ్యంగా 2011లో బీజేపీ సహా, ఆనాటి విపక్షాలన్నీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేసిన సమయంలో రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు, మన్మోహన సింగ్ ప్రభుత్వం పై వత్తిడి చేయలేదు. నిజానికి అప్పట్లో రాహుల్ గాంధీ తలచుకుంటే 2011 జనగణనతో పాటుగానే కులగణన కూడా పూర్తయ్యేది కదా? అని బీజేపీ ప్రశ్నిస్తోంది.
నిజానికి అప్పట్లో రాహుల్ గీసిన గీతను దాటే ధైర్యం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఎవరికీ లేదనేది జగమెరిగిన సత్యం. కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్సును ప్రెస్ మీట్ పెట్టి మరీ చించి పారేసినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఎవరూ ఇదేమిటని ఆయన్ని ప్రశ్నించ లేదు. ప్రశ్నించే సాహాసం కూడా చేయలేదు.
నిజానికి,రాహుల్ గాంధీకి ఆ రోజుల్లో సాధ్యం కానిది ఏదీ లేదు. ఆరోజునే ఆయన ముందు చూపు కళ్ళు తెరిచి ఉంటే.. 2011 జనగణనతో పాటే కులగణన కూడా జరిగేది కదా? ఆ రోజున రాహుల్ గాంధీ ముందు చూపు, ఎందుకు కళ్ళు మూసుకుంది? వంటి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలాగే, కులగణనకు బదులుగా 2013లో చేసిన సామాజిక ఆర్థక సర్వే లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తప్ప మిగిలిన వివరాలు ఏవీ బయట పెట్టలేదు. సో.. కాంగ్రెస్’ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయని, విశ్లేషకులు అంటున్నారు.
మరో వంక రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అంటున్నారు. అయితే అదంతా తప్పుల తడకని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న పెద్దల సభలోనే లెక్కలు చెప్పారు. నిజానికి తెలంగాణ సహా రాష్ట్రాలు నిర్వహించిన, నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదేనని, వివిధ రాష్ట్రాల్లో కులగణన సర్వేలను రాజకీయ కారణాలతోనే చేపట్టారని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు, అంటే, రూ.160 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి గత నవంబర్‌లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన)ని కేంద్ర ప్రభుత్వం రోల్ మోడల్ గా తీసుకోవడం కాదు.. కనీసం పరిగణనలోకి కూడా తీసుకోదని తేలిపోయింది. సో.. రాహుల్ గాంధీ ముందు చూపు మోదీని ఏ మేరకు ప్రభావితం చేసిందో ఏమో కానీ రాహుల్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన అంటూ ఖర్చుచేసిన రూ.160 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారిందని అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఆయన్ని ప్రశంసలలో ముంచెత్తినా, ముందు చూపు అసలు కథ ముందుందని అంటున్నారు.