సినీ కార్మికులకు వరాలు.. సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా?
posted on Oct 29, 2025 @ 10:14AM
ఒక పక్క నవీన్ యాదవ్.. తన ప్రధాన ప్రత్యర్ధి కేటీఆర్ కి సవాల్ విసిరి.. తానేంటో ప్రూవ్ చేసుకోడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లే టార్గెట్ గా కొన్ని లెక్కలు సరి చేస్తున్నారు. అవెలాంటి లెక్కలో చూస్తే.. బేసిగ్గా జూబ్లీహిల్స్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సినిమా జనాలు. కృష్ణానగర్, ఇంద్రా నగర్ వంటి ప్రాంతాల్లో అధికంగా నివసించే సినీ కార్మికుల ను ఆకట్టుకునేలా రేవంత్ వరాల జల్లు కురిపించేశారు.
ఇకపై పెద్ద పెద్ద సినిమా హీరోల సినిమాల టికెట్ ధరలుపెంచాలంటే లాభాల్లో 20 శాతం వాటా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. ఇప్పటి వరకూ ఇలా సినీ కార్మికులను కలవడానికి ఏ సీఎం కూడా రాలేదనీ.. తాను అలాక్కాదని.. మీ వల్లే మన తెలుగు సినిమా ఏకంగా ఆస్కార్ మెట్లు ఎక్కిందని.. అలాంటి కార్మికులకు సీఎం గా కాకుండా ఒక ఇంటి సభ్యుడిగా మీ ముందుకు వచ్చాననీ.. వచ్చే నవంబర్ చివరి వారంలో.. మిమ్మల్ని తప్పక కలుస్తాననీ.. ఆపై డిసెంబర్ 9న మీపై వరాల జల్లు కురిపించడం ఖాయమని అనడంతో ఒక్కసారిగా వారిలో ఆనందం పొంగిపొర్లింది.
ఇదిలా ఉంటే హఠాత్తుగా సీఎంకు సినీ కార్మికులపై ప్రేమ పొంగి పొర్లడానికి ఇక్కడ అధికంగా ఉండే సీమాంధ్ర సెటిలర్స్, అలాగే ఒక సామాజిక వర్గం కారణమని అంటున్నారు. సీఎం ఇలా వీరందరినీ కలసే విషయంలో మంత్రి తుమ్మల కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇటు క్లాస్ అటు మాస్ రెండు వర్గాల ఓటర్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ కలయిక ద్వారా సీఎం కవర్ చేశారు సీఎం రేవంత్. దీంతో నవీన్ గెలుపు నల్లేరు నడక అన్న ధీమా కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది.