లేటైనా లేటెస్ట్ గా.. హుజురాబాద్ లో రేవంత్ షో అదుర్స్
posted on Oct 23, 2021 @ 5:51PM
తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఈటల రాజేందర్ తో కాంగ్రెస్ కుమ్మక్కైందంటూ అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు దిమ్మతిరిగే కౌంటరిచ్చేలా ఆయన హుజురాబాద్ లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ తో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, ఈటల రాజేందర్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని ఆరోపించారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ కు.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని హెచ్చరించారు. మోదీ, కేసీఆర్ కలిసి పెట్రో ధరలతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లు జోడు గుర్రాల్లా ఈటల-హరీష్‌రావు తిరిగారని విమర్శించారు. ఇప్పుడు తనకు, ఈటలకు పడటంలేదని హరీష్‌రావు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.
టీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ ఆరోపించారు. ఈటల దేని కోసం కొట్లాడారని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారో చెప్పాలంటూ హరీశ్ రావును నిలదీశారు. ఈటల అవినీతిపై విచారణ ఏమైందో కేటీఆర్ చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆదివారం కూడా హుజురాబాద్ లో ప్రచారం చేయనున్నారు.