గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండరు.. ఓటమి భయంలో కేటీఆర్..
posted on Oct 23, 2021 @ 5:26PM
హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోయాయి. రేవంత్‌రెడ్డి, ఈటల ఓ హోటల్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లో చేరిపోతారు. కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల మాదిరి హుజురాబాద్‌లోనూ కాంగ్రెస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ కుట్ర చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కుమ్మక్కయ్యాయంటూ అధికార పార్టీ, మంత్రి కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకటేననే ఆరోపణపై తాజాగా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఖండించారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి కేటీఆర్ ఇలాంటి అబాంఢాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...
బీజేపీ మతతత్వ పార్టీ.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. రెండూ భిన్న ధృవాలు. కేటీఆర్‌కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికలో ఓటమి భయంతోనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈటలను గెలిపించడం కోసం కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుంది? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితమని భట్టి క్లారిటీ ఇచ్చారు.
ఇక, అధికార పార్టీనీ కార్నర్ చేశారు భట్టి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయకారీ ఒప్పందాలు ఉన్నాయన్నారు. ఈటల అవినీతిపై ప్రభుత్వ విచారణ ఎటుపోయింది? కేసీఆర్ ఢిల్లీ మంతనాల సంగతేంటి? టీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే మంతనాలు జరిగాయా, లేదా? అంటూ రివర్స్ అటాక్ చేశారు.
కాంగ్రెస్ నాయకులపై బురద జల్లితే ప్రజలు నమ్మరు. గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండరు... కాంగ్రెస్ భావజాలం ఉన్న వారే ఉంటారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం టీఆర్ఎస్‌కు తగదు.. అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన విమర్శలకు సీఎల్పీ లీడర్ భట్టి ధీటుగా జవాబిచ్చారు.
దళితబంధును ఆపడంలో టీఆర్ఎస్, బీజేపీ పాత్ర ఉంది. ఇద్దరు దొంగలు కలిసి దళితబంధును ఆపారు. బల్మూర్ వెంకట్ బలమైన అభ్యర్థి. కాదని ఎవరన్నా అంటే అది వారి అవగాహనా రాహిత్యం.. అంటూ అధికార పార్టీ, కేటీఆర్ చేస్తున్న అన్నిరకాల ఆరోపణలు, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క.