హుజురాబాద్‌తో జరగబోయేది ఇదే.. రేవంత్‌రెడ్డి సంచలనం..
posted on Oct 9, 2021 @ 4:41PM
హుజురాబాద్ ఉప ఎన్నికతో జరిగేది ఏంటి? అయితే, ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అవుతారు. లేదంటే, గెల్లు శ్రీనివాస్ గెలుస్తారు. అంతేనా? అంటే, అలా కానేకాదు, అంత సింపుల్ అసలే కాదు.. ఇంకా చాలనే ఉందంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆ ఇద్దరులో ఎవరు గెలిస్తే.. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తనదైన స్టైల్‌లో అంచనా వేసి చెబుతున్నారు. ఇంతకీ రేవంత్‌రెడ్డి జోస్యం ఏంటంటే..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చివరికి బకరా అయ్యేది మంత్రి హరీశ్‌రావేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తేల్చేశారు. కేటీఆర్‌ను సీఎంను చేసేందుకు హరీశ్‌రావును కేసీఆర్ పావుగా వాడుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ కోసమే ఈటల రాజేందర్, హరీశ్‌రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలని పన్నాగం పన్నారని ఆరోపించారు.
ఈటలను పొమ్మనలేక పొగబెట్టి బయటికి పంపించేశారని చెప్పారు. ఒకవేళ హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే.. అది సాకుగా చూపించి హరీశ్‌రావును సైతం పార్టీ నుంచి పంపించేస్తారని అన్నారు. ఒకప్పుడు మంచి మిత్రులైన ఈటల, హరీశ్‌లను ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలుతాయనేది కేసీఆర్ వ్యూహమనేది రేవంత్‌రెడ్డి ఆరోపణ.
ఇక, బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య అంతర్గత ఒప్పందాలున్నాయని, అందుకే కేసీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా నమోదు చేయడం లేదని పీసీసీ చీఫ్ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు ప్రమాదమని రేవంత్ అన్నారు.
సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్‌ది ప్రజల సమస్య కాదని.. పైసలు, పంపకాల పంచాయితీ అని మండిపడ్డారు. వారిద్దరి స్వార్థం కోసమే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కేసీఆర్, ప్రధాని మోదీ అక్రమాలను నిలదీయడానికే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని తెలిపారు. ఏడేళ్లలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీలేదని.. చేసిందల్లా అల్లుడిని అంబానీ, బిడ్డను బిర్లా, కొడుకును టాటా చేసి ఆయన చార్లెస్ శోభరాజ్ అయ్యారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇలా, ఇటు టీఆర్ఎస్‌ను, అటు బీజేపీని కార్నర్ చేస్తూ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు హుజురాబాద్ ఎన్నిక వేళ కలకలం రేపుతున్నాయి. రేవంత్ విశ్లేషణ ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.