సీఎం కేసీఆర్ పై మూడు సీబీఐ కేసులు?
posted on Aug 24, 2021 @ 7:26PM
తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరింత స్పీడ్ పెంచారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లిలో ఆయన దీక్షకు దిగారు. రేవంత్ దీక్షకు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ ను అవినీతిని వెలికి తీస్తామని కొంత కాలంగా చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. ఈ విషయంలో మరింత దూకుడుగా వెళుతున్నారు. మూడు చింతలపల్లి దీక్షలో మాట్లాడిన నేతలు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి కాక రాజేశారు.
కొడంగల్ నియోజకవర్గంలో కుట్రలు కుతంత్రాలు చేసి కేసీఆర్ తనను ఓడించారని చెప్పారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ లో కాంగ్రెస్ ను ఓడిస్తే.. అక్రమాలకు అడ్డు అదుపు ఉండదని భావించారన్నారు .దత్తత ముసుగులో గజ్వేల్ ప్రాంతాన్ని కేసీఆర్ వంచిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో 57 ఏళ్లకే ఫించన్లు, మూడెకరాల భూమి , ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేసినట్లు నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటున్న.. కేసీఆర్ మేడ్చల్ జిల్లా లో ఒక్క డిగ్రీ కాలేజ్ పెట్టలేదన్నారు రేవంత్ రెడ్డి. ధనిక రాష్ట్రంగా తెలంగాణను ఇస్తే అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు.
తెలంగాణ ఉద్యమ ముసుగులో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు బాధితులకు పదివేల పరిహారం అని చెప్పి పక్కన పెట్టారని విమర్శించారు. హైదరాబాద్ మాదిరిగా హుజురాబాద్ లో కూడా మోసం చేస్తారన్నారు. పదివేలు ఇవ్వలేని వ్యక్తి.. పది లక్షల రూపాయలు ఇస్తడా అని రేవంత్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు లబ్ధిదారుల జాబితా కొనసాగుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఓట్లు వేస్తే.. పది లక్షల అని లిటిగేషన్స్ పెడతారన్నారు. గజ్వేల్ కు ఎట్ల వస్తరని అంటున్నారు.. వస్తా వచ్చే నెల గజ్వేల్ వచ్చి తీరుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దామోదర రాజనర్సింహ గజ్వేల్ సభ తేదీ రెండు రోజుల్లో చెబుతాడు.. వచ్చి తీరుతానన్నారు. అడ్డం ఎవడు వస్తే.. వాన్ని తొక్కుకుంటా వెళ్తా.. లేకపోతే నేను గుండు కొట్టించుకుంటానని రేవంత్ శపథం చేశారు.
రేవంత్ వచ్చాక కాంగ్రెస్ కు కొత్త ఉత్సహం వచ్చిందన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. దత్తత అంటే.. ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని.. కాంగ్రెస్ హయాంలో చాలా గ్రామాలూ అలా చేసి చూపించామన్నారు. ఒక్క వర్గానికి డబ్బులిస్తాం అని చెప్పడం అవివేకమన్నారు పొన్నాల. తాము లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని.. కేసీఆర్.. డబుల్ బెడ్ రూమ్ లు ఎక్కడ ఇచ్చావో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ నువ్వు చేసిన ద్రోహాలకు పురుగులో పడి చస్తావ్ అంటూ శాపనార్ధాలు పెట్టారు పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్ చేసిన పూజలు కూడా ఆయనను కాపాడలేవన్నారు. కేసీఆర్ పై మూడు కేసులున్నాయని 2014లోనే సీబీఐ ప్రకటించిందని పొన్నాల చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కు జైలు జీవితం ఖాయమన్నారు. తన కోసమే వరంగల్ లో కొత్త జైలు కేసీఆర్ కట్టుకుంటున్నారని పొన్నాల సెటైర్లు వేశారు.
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నది మూడు చింతలపల్లి గ్రామాన్ని కాదు.. మంత్రి మల్లారెడ్డిని అని పీసీసీ ప్రచార కమిటి చైర్మెన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. దత్తత గ్రామంలోనే దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్రూమ్ లు లేవన్నారు. దగా, మోసం తో దళితులకు కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారని మధు యాష్కి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాని.. ఉద్యమంలో రాళ్లు వేసిన కౌశిక్ రెడ్డి కి ఇచ్చాడన్నారు. టీఆర్ఎస్ , బీజేపీ లు ఒకే నాణేనికి బొమ్మ, బొలుసు లాంటివన్నారు. ఒకరు రాష్ట్రంలో విలువైన భూములు అమ్ముతుంటే.. కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని మధు యాష్కి మండిపడ్డారు.