ఏడుకొండలవాడి సొమ్ముపై కన్నేసిన జగన్ సర్కార్..!
posted on Oct 17, 2020 @ 1:15PM
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు వచ్చే విరాళాలను "అధిక వడ్డీ కోసం" రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పెద్దలు నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏ నెలకు ఆ నెల అప్పులు చేస్తూ పీకల్లోతూ అప్పుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు చేతనైన సాయం చేసేందుకు టీటీడీ పెద్దలు తీర్మానించారు. దీంతో తిరుమల శ్రీవారి సొమ్మును వాడుకునేందుకు రంగం సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన ఏడుకొండల వాడి సొమ్మును విత్ డ్రా చేసి, ఆ డబ్బుతో ఏపీ ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.
మొదట కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీస్ లో డిపాజిట్ అని నిర్ణయం తీసుకొని.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అని సవరణ చేయటం ద్వారా నిధుల కొరతతో సతమతమవుతున్న సర్కార్ నెత్తిన పాలు పొసే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అవసరాల కోసం వాడుకునేందుకే ఈ తతంగం అంతా నడిపించారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ‘‘టీటీడీ అన్నదాన ట్రస్టు, బర్డ్ ట్రస్టు, గోసంరక్షణ ట్రస్టు... ఈ మూడు ట్రస్టుల రోజువారీ కార్యకలాపాలు వడ్డీ సొమ్ములతోనే నడుస్తున్నాయి. అందువల్ల, అధిక వడ్డీ కోసం సెక్యూరిటీలలో సొమ్ము డిపాజిట్ చేయాలి’’ అంటూ ఒక వింత కారణం చూపించారు. మొత్తానికి "ట్రస్టుల రోజు వారీ కార్యకలాపాలకు వడ్డీయే దిక్కు" అని టీటీడీయే చెబుతోంది కాబట్టి, అయితే.. ప్రతినెలా లేదా మూడు నెలలకొక సారి వడ్డీ డబ్బులు చేతికందితే ఉపయోం ఉంటుంది. అయితే ఈ వెసులుబాటు బ్యాంకు డిపాజిట్లకే ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల కనీస సమయం 5 సంవత్సరాలు. అదే గరిష్ఠంగా అయితే 40 ఏళ్లు.. కానీ సర్వసాధారణంగా సెక్యూరిటీలలో 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తారు. అయితే వీటిపై మధ్యలో వడ్డీ చెల్లించే వెసులుబాటు ఉండదు. కాలపరిమితి పూర్తైన తర్వాత ఒకేసారి వడ్డీతో కలిపి డబ్బులు చెల్లిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో 15 - 20 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే... అవి మెచ్యూరిటీ అయ్యేనాటికి పరిస్థితి ఏంటో ఎవరు చెప్పలేరు. టీటీడీ ఆమోదించిన తీర్మానంతో ఆ ఏడుకొండలవాడి సొమ్మును సర్కారు వారు ఎంచక్కా వాడుకోవచ్చు!
ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు ప్రస్తుతం గరిష్టంగా 5.5 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని…అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి అని మొదలు పెట్టి, తరువాత రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల పేరుతో ఏపీ సర్కార్ ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. వచ్చే డిసెంబరులో భారీ ఎత్తున టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్ లు మెచ్యూర్ అవుతున్న నేపథ్యంలో ఈ నిధులను ప్రభుత్వ ఖజానాకు తరలించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి భూముల విక్రయం చేసే ప్రయత్నం పై భారీగా వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం… ఇప్పుడు బాండ్స్ పేరుతో శ్రీవారి ఆస్తులను వాడుకునే ప్రయత్నాలు ఎంతవరు ఫలిస్తాయో వేచి చూడాలి.