బీజేపీకి రేవంత్ దెబ్బ.. కమలం కకావికలం! తెలంగాణ బాహుబలి..
posted on Jul 23, 2021 @ 4:39PM
తెలంగాణ రాజకీయాల్లో మర్రివృక్షంలా ఎదుగుతున్నారు రేవంత్‌రెడ్డి. మర్రిచెట్టు నీడలో మరే మొక్క ఎదగలేదు. అలానే జరుగుతోంది. కాంగ్రెస్‌లో సూపర్ హీరో. తెలంగాణలో బాహుబలి లీడర్. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాకతో.. మిగతా రాజకీయ పార్టీలన్నీ షేక్. తెలంగాణ భవన్ గోడలకు బీటలు వస్తున్నాయని.. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ కుప్పకూలడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇక, రేవంత్‌రెడ్డి రాకతో అందరికంటే బీజేపీకే గట్టి దెబ్బే తగులుతోంది. రేవంత్ దూకుడుకు అట్రాక్ట్ అయి.. ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్‌కే మనుగడ సాధ్యమని.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డే సరైన మొనగాడని.. వారంతా భావిస్తున్నారు. అందుకే, భవిష్యత్ అంతా రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్‌దే కాబట్టి.. బీజేపీలో కొనసాగితే తమ పొలిటికల్ ఫ్యూచర్ దెబ్బతింటుందని పలువురు కమలం నేతలు కంగారుపెడుతున్నారు. అందుకే, బీజేపీని వదిలి కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు.
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు.. కాంగ్రెస్ పార్టీ ఆగమాగం ఉండేది. ఎవరి ఇష్టారాజ్యం వారిది. అందుకే, తమకు అన్యాయం జరిగిందంటూ అనేకమంతి నాయకులు పార్టీని వీడారు. అందులో, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ఒకరు. జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తితో.. కాంగ్రెస్‌ను ఇక ఎవరూ బాగు చేయలేరంటూ అసహనంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు విక్రమ్‌గౌడ్. ఇప్పుడు రేవంత్‌రెడ్డి రాకతో మళ్లీ కాంగ్రెస్‌పై నమ్మకం వచ్చినట్టైంది. త్వరలోనే విక్రమ్‌గౌడ్ పువ్వు పార్టీకి చెవిలో పువ్వు పెట్టేసి.. రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన నేతగా ఉన్న విక్రమ్‌గౌడ్ రాక.. రేవంత్‌రెడ్డికి అదనపు బలమనే చెప్పాలి.
ఇక, టీడీపీలో ఉన్న అనుబంధంతో.. ఇటీవలే రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్, ఆయన తనయుడు వీరేందర్‌గౌడ్‌ను రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వీరేందర్‌గౌడ్ ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్ లీడర్‌గా ఉన్నారు. రేవంత్‌రెడ్డితో ఉన్న స్నేహంతో ఆయన త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. విక్రమ్‌గౌడ్, వీరేందర్‌గౌడ్‌లాంటి యంగ్ లీడర్స్ రేవంత్‌రెడ్డికి జై కొడితే.. అది బీజేపీకి బిగ్ మైనస్.
గ్రేటర్‌లో మరో స్ట్రాంగ్ లీడర్ సైతం బీజేపీకి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఎప్పటికైనా బీజేపీని వీడాల్సిందే. ఎందుకంటే ఆయన నిఖార్సైన రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వకుండా అధిష్టానం వేధిస్తోందనే అక్కసుతోనే శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌ను వీడి కమలం పార్టీలో చేరారు. అలాంటిది, తన నేత రేవంత్‌కు తాను అనుకున్నట్టుగానే పీసీసీ పీఠం దక్కడంతో కూన.. త్వరలోనే మళ్లీ తిరిగొస్తారని అంటున్నారు. శ్రీశైలంగౌడ్ బీజేపీని వీడితే.. గ్రేటర్‌లో కమలంపార్టీకి భారీ డ్యామేజ్ తప్పకపోవచ్చు.
అటు, రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకోగా.. ఆలోగా రేవంత్‌రెడ్డికి పీసీసీ పోస్ట్ దక్కడంతో ఆయనిప్పుడు పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డిలాంటి బలమైన నాయకుడు కావాలంటూ ఆయన మొదటినుంచీ డిమాండ్ చేస్తున్నారు. అది కుదరకే.. కాంగ్రెస్‌పై వెగటు పుట్టి పార్టీని వీడారు. ఆయన కోరుకున్నట్టే.. రేవంత్ పీసీసీ చీఫ్ కావడం.. రేవంతే స్వయంగా కొండా ఇంటికెళ్లి ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడంతో.. ఆయన రేపోమాపో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. బీజేపీ మరో బలమైన నేతను కోల్పోయినట్టే.
టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనేది ఇన్నాళ్లూ వినిపించిన మాట. రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఇప్పుడా ఈక్వేషన్ మారిపోతోంది. బీజేపీ నాయకులే కాంగ్రెస్ వైపు కదలివస్తున్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ తర్వాత అంతటి స్థాయి నాయకుడు ధర్మపురి అర్వింద్. ఏకంగా ఆ అర్వింద్ సోదరుడు సంజయ్ కాంగ్రెస్‌లో చేరుతుండటం ఆసక్తికరం. పలువురు బీజేపీ బడా నాయకులు సైతం రేవంత్‌రెడ్డి నాయకత్వానికి జై కొడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎర్ర శేఖర్ సైతం పార్టీకి రాజీనామా చేసి.. రేవంత్‌రెడ్డి చెంతకు చేరడం బీజేపీని కలవరపాటుకు గురి చేస్తోంది.
ఇక, కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌కు లోనుకాకుండా బీజేపీలో చేరిన మాజీ టీటీడీపీ నేతలు పలువురు తమ పాత సహచరుడి నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనార్థన్‌లు బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
రేవంత్ ఎఫెక్ట్ టీఆర్ఎస్ అసంతృప్తులతో పాటు.. బీజేపీనీ దెబ్బ తీస్తుండటం ఆసక్తికర పరిణామం. మా పార్టీకి ఏమైంది.. ప్రధానిగా మోదీ ఉన్నారు.. బండి సంజయ్ ఉన్నారు.. ఈటల రాజేందర్ కూడా వచ్చారు.. ఇక తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఆల్టర్‌నేట్ తామేనని విర్రవీగుతున్న కమలదళానికి ఇలాంటి వరుస పరిణామాలు ఊహించని షాక్ అనే చెప్పాలి. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నుంచి వెళ్లే నాయకులను మాత్రమే చూశారని.. ఇప్పుడిక కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయని.. ముందుముందు బీజేపీతో పాటు టీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు ఉంటాయని అంటున్నారు. జస్ట్.. వెయిట్ అండ్ సీ.. అంటూ సవాల్ విసురుతున్నారు.