రేవంత్ జోలికెందుకు.. నీ కొంపలో కుంపటి ఆర్పుకో జగన్!
posted on May 11, 2024 @ 11:13AM
జగన్ ఎలా తయారయ్యాడంటే, తన విషయంలో ఏది జరిగినా దాని వెనుక వున్నది చంద్రబాబే. జగన్‌కి నరాల వీక్నెస్ వచ్చినా దానికి కారణం చంద్రబాబే. ఎంచక్కా బాబాయ్‌ని పైకి పంపేసి, ఆ నేరాన్ని చంద్రబాబు నెత్తిన వేశాడు. కోడికత్తి డ్రామా ఆడించి ఆ నేరాన్ని కూడా చంద్రబాబు అకౌంట్లోనే వేశాడు. ఈ రెండు దుర్మార్గాల కారణంగా గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన జగన్, ఈసారి ఎన్నికలలో కూడా ప్రతీదానికీ చంద్రబాబుని బాధ్యుడిని చేసి జనాన్ని మభ్యపడితే మరోసారి విజయం వరిస్తుందని భావిస్తున్నాడు. అందుకే గులకరాయి డ్రామా క్రియేట్ చేశాడు. ఆ డ్రామా కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినప్పటికీ వెనుకడుగు వేయని జగన్ ప్రతీదానికి చంద్రబాబునే దోషిగా చూపిస్తూ ఆత్మానందం పొందుతున్నాడు. తన సొంత చెల్లి షర్మిల, వివేకా కుటుంబ సభ్యులు జగన్‌కి వ్యతిరేకంగా రోడ్డెక్కడానికి కూడా చంద్రబాబే కారణమని అంటున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు కాబట్టి, అతని ద్వారా షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, ఆమె ద్వారా తనను చంద్రబాబు వేధిస్తున్నాడనేది జగన్ ఎప్పటి నుంచో చెప్తున్న వాదన. గత కొంతకాలంగా ఈ విషయంలో మౌనంగా వున్న రేవంత్ రెడ్డి ఇక ఊరుకుంటే లాభం లేదని రియాక్ట్ అయ్యారు. జగన్‌కి వాత పెట్టేలా మాట్లాడారు. నా జోలికి ఎందుకు వస్తావు.. ముందు నీ కొంపలో కుంపటి ఆర్పుకో అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధాలేవీ లేవని, ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నదే తన ధ్యేయమని రేవంత్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలను సొంత తల్లి, సొంత చెల్లే నమ్మడం లేదు.. జనం ఎందుకు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. కన్నతల్లి, సొంతచెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మొదట జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వాలని అన్నారు.